
ఔను! రాజకీయాల్లో నేతలు ఏ పార్టీలో ఉన్నారు.. అనేది ఎంతకీలకమో.. అంతకన్నామించి.. ప్రజల్లో మద్దతు కూడగట్టడం, వారిలో విశ్వసనీయతను పెంచడం అనేది మరీ ముఖ్యం. రాజకీయాల్లో ఎంత అనుభవం ఉన్నా.. ఈ కీలకమైన సూత్రాన్ని మరిచిపోతే.. నేతలకు దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే.. ప్రకాశం జిల్లాలో కీలకమైన నాయకుడు, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న కరణం బలరాం విషయంలో జరుగుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.
దాదాపు 40 ఏళ్లుగా కరణం బలరామకృష్ణమూర్తి రాజకీయాల్లో ఉన్నారు. నిజానికి ఇప్పుడు ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారిలో ఎవరూ గెలిచిన దాఖలాలు లేవు. ఒక్క చంద్రబాబు తప్ప. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కరణం లాంటి నేత తన అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించి… వారి మన్ననలు పొందేలా ఉండాలి. అయితే కరణం మాత్రం కేవలం తన దూకుడు, కక్ష పూరిత రాజకీయాల కారణంగా జిల్లాలో కావాల్సినంత చెడ్డ పేరును మూటకట్టుకున్నారు.
మరీ ముఖ్యంగా.. ఇటు ఆయన సొంత నియోజకవర్గం అద్దంకిలో పూర్తిగా విశ్వసనీయతను పోగొట్టుకున్నా రు. దీంతోనే తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన గొట్టిపాటి రవికుమార్‌పై 2009 ఎన్నికల్లో తాను ఓడిపోగా… 2014 ఎన్నికల్లో తన కుమారుడు వెంకటేష్‌ను నిలబెట్టినా.. గెలిపించుకోలేక పోయారు. ఇక, ఇప్పుడు చీరాలలో ఆయనే గెలిచారు.. ఈ వయస్సులో కరణం గెలుపు మంచి అవకాశం. పైగా పార్టీ మారారు… అధికారి పార్టీకి అనుబంధంగా కొనసాగుతోన్న ఆయన చీరాలను అభివృద్ధి చేయడం కన్నా… ఎప్పుడూ వివాదాల్లో ఉండేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
పదే పదే పార్టీలు మారడం, సొంత పార్టీ నేతలపైనే వివాదాలకు దిగడం వంటివి ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఇది ఒకరకంగా పిల్ల రాజకీయాలు చేస్తున్న పెద్దాయనగా.. ఆయనకు పేరు తెచ్చాయి. అటు కరణం వారసుడు వెంకటేష్ కూడా తండ్రి బాటలోనే వెళుతుండడం కూడా ఆ ఫ్యామిలీకి ఎదురు దెబ్బే. ఈ తండ్రి కొడుకుల తీరు మారకపోతే… మున్ముందు ఆయనపై సంపూర్ణంగా చీరాలలో కూడా విశ్వసనీయత పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా అందరినీ కలుపుకొని వెళ్తారో.. లేక ఇలానే ఒంటెత్తు పోకడలతోనే ముందుకు వెళతారో ? చూడాలి.