వాహ‌న‌దారులు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. లైసెన్స్ జారీలో కీల‌క మార్పులు

January 6, 2021 at 5:44 pm

ఇప్ప‌టి వ‌ర‌కు లైసెన్స్ ఉన్నా లేక‌పోయినా.. గ‌డువు ముగిసినా రెన్యువ‌ల్ చేసుకోక‌పోయినా చెల్లింది. ఇష్టారాజ్యంగా ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించినా న‌డిచింది. ఇప్పుడు ఆ కాలం చెల్లింది. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే జేబుకు చిల్లుప‌డ‌నుంది. తెలంగాణ ప్ర‌భుత్వం స‌రికొత్త‌గా కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్‌ల‌ను జారీ చేయ‌డం, రెవెన్యుకు సంబంధించి కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. కేంద్ర మోటార్ వెహికిల్ యాక్టుకు అనుగుణంగా ప‌లు స‌వ‌ర‌ణ‌ల‌ను చేసింది. ఆ నిబంధ‌న‌లు ఇలా ఉన్నాయి.

రాష్ట్రంలో డ్రైవింగ్​ లైసెన్స్​ కావాలంటే ఇప్పటివరకు కనీసం ఎనిమిదో తరగతి చదివి ఉండాలన్న నిబంధన ఉండేది. తాజా నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఎలాంటి విద్యార్హత లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. అదేవిధంగా​ లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకోవడానికి కూడా నిబంధనల్లో అధికారులు మార్పులు చేశారు. ఇప్పటి వరకు 50 ఏళ్లు దాటిన వారు రెన్యువల్ కోసం మెడికల్ సర్టిఫికేట్ అందించాలని నిబంధన ఉండ‌గా, ఇక‌పై 40 ఏళ్లు దాటిన వారు కూడా వైద్యుల ధ్ర‌వీక‌ర‌ణ ప‌త్రాన్ని అంద‌జేయాల్సి ఉంటుంది. ​అయితే లైసెన్స్ గడువు ముగిశాక రెన్యువల్ చేయించుకోవడం ఆలస్య‌మైతే భారీగానే ఫెనాల్టీ క‌ట్టాల్సి ఉంటుంది. లైసెన్స్ గ‌డువు ముగిసిన తర్వాత మొదటి నెల వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అది ముగిసిన తర్వాత రూ. వెయ్యి ఫైన్ చెల్లిస్తేనే రెన్యువల్ కు అవకాశం ఉంటుంది. ఒక వేళ ఆ గడువు ముగిసినా ఏడాది వరకూ రెన్యువల్ చేసుకోకపోతే లైసెన్స్ రద్దు కానుంది. అప్పుడు కొత్త‌గా మ‌ళ్లీ మళ్లీ లైసెన్స్ లెర్నింగ్ నుంచి మొద‌లు పెట్టాల్సి ఉంటుంది. డ్రైవింగ్​ టెస్టును కూడా పాస్ కావాల్సిందే. అదీగాక ఎన్ని సంవత్సరాలు రెన్యువల్ చేయించుకోకుండా ఆలస్యం చేస్తే అన్ని వేల రూపాయలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇదిలా ఉండ‌గా.. కొత్త వెహికిల్ ఆక్ట్ ప్ర‌కారం హెల్మెట్ లేకున్నా, ఆర్‌సీ లేకున్నా భారీగా జ‌రిమానా చెల్లించాల్సి ఉంటుంది.

వాహ‌న‌దారులు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. లైసెన్స్ జారీలో కీల‌క మార్పులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts