
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగుదూర్ నిర్మిస్తున్నారు. ఇక ఇటీవలె ఈ సినిమా పూజ కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి.
త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. 2021 మార్చ్ నుంచి మొదలు పెట్టి వీలైనంత త్వరగా రెగ్యులర్ షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రభాస్‌కు జోడీగా ఎవరు నటిస్తున్నారు అన్నది ఇప్పటి వరకు తేలలేదు. ఇటీవల ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దిశా పటాని ఎంపిక అయినట్టు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. దిషా పటానీ స్థానంలో శ్రుతిహాసన్ పేరు వినిపిస్తోంది.
ప్రభాస్ సరసన శ్రుతి బాగుంటుందని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. ఇందులో భాగంగా.. ప్రశాంత్ నీల్ ఇటీవల శ్రుతిని సంప్రదించగా.. ఆమె వెంటనే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకూ శృతి హాసన్ మరియు ప్రభాస్ కలిసి నటించలేదు. కానీ, వీరిద్దరి జంట స్క్రీన్ పై చూసేందుకు బావుంటుంది అంటూ అభిమానులు ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. కాగా, చాలా కాలం తర్వాత శ్రుతి ఇటీవల రవితేజ `క్రాక్` చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి.. సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.