
సింగర్ సునీత.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ టాప్ సింగర్స్‌లో ఒకరైన సునీత.. ఎన్నో పాటలకు తన మధురమైన గాత్రాన్ని అందించి ప్రేక్షకులను అలరించింది. కేవలం సింగర్ గానే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా సునీత సత్తా చాటింది. ఇక ఇటీవల రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న సునీత.. కొత్త జీవితంలో అడుగు పెట్టింది.
ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ సినిమాలో ఓ పాటంటే తనకు నచ్చనే నచ్చదంటుంది సునీత. ఇంతకీ ఆ సాంగ్ ఏదో కాదు.. బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఆదిత్య ఆర్ట్స్ పతాకం పై ఆదిత్య బాబు నిర్మించిన ఆర్య 2లోని `రింగ రింగ` సాంగ్. ఎందుకో తెలీదు గాని ఈ సాంగ్ అంటే సునీతకు అస్సలు ఇష్టముండదట.
సింగింగ్ కాంపిటేషన్‌లో ఎవరైనా పాడేందుకు ఆ పాటను తీసుకున్నా, తాను జడ్జిగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఆ పాటకు డ్యాన్స్ వేస్తామన్నా వద్దని చెబుతానని సునీత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే ఎందుకు ఇష్టం లేదు అన్నది మాత్రం తెలపలేదు. కాగా, ఆర్య 2లోని రింగ రింగ పాట మీనింగ్ ఎలా ఉన్నా అప్పట్లో ఒక ఊపు ఊపింది. అంతేకాదు, ఈ సాంగ్‌ను స్వయంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన సినిమాలో రీమేక్ చేయించి మరీ పెట్టుకున్నాడు.