
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురును అందించింది. పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ గడువును మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడం, రెన్యువల్ కోసం అనేక మంది విద్యార్థులు ఇంకా దరఖాస్తులు సమర్పించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దరఖాస్తు చేసుకోవడానికి మొదటగా డిసెంబర్ 31, 2020ని ఆఖరు తేదీగా నిర్ణయించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ పాస్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు గడువును ఫిబ్రవరి 15వ తేదీ వరకు పొడిగించి విద్యార్థులకు గొప్ప అవకాశాన్ని కల్పించింది.
ఇదిలా ఉండగా 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోస్టుమెట్రిక్ కోర్సులకు సంబంధించి మొత్తం 12.65 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు.అందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను అధికారులు సెప్టెంబర్లో ప్రారంభించారు. తొలుత డిసెంబర్ 31వ తేదీని చివరి గడువుగా నిర్ణయించింది. అయితే ఆ గడువులోగా రెన్యువల్ కు సంబంధించి 6.33 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటికీ 21 శాతం మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో అడ్మిషన్లు ఆలస్యం అవడం తదితర కారణాలతో ఫ్రెషర్స్ విభాగంలో మెజారిటీ కోర్సులకు సంబంధించి ఇంకా దరఖాస్తు ప్రక్రియ అసలు ప్రారంభమే కాలేదు. ఈ పరిస్థితి అంతటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియ గడువును మరోసారి పొడిగించింది. దీంతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.