సిటీబ‌స్సు ప్ర‌యాణికుల‌కు ఆర్టీసీ సూప‌ర్ బొనాంజా

January 8, 2021 at 12:52 pm

సిటీ బ‌స్సు ప్ర‌యాణికుల‌కు ఆర్ట‌సీ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. బ‌స్‌పాస్ వినియోగ‌దారుల‌కు గొప్ప వెసులుబాటును క‌ల్పించింది. బ‌స్సు పాస్ తీసుకోవాల‌న్నా, రెన్యువ‌ల్ చేసుకోవాల‌న్నా కార్యాల‌యానికి రావాల్సిన అవ‌స‌రం లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉద్యోగులు, విద్యార్థులు, రోజువారీ కూలీలు మరేదైనా అవ‌స‌రాల కోసం గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని సామాన్యులు ఎక్కువ‌గా బ‌స్సుల‌నే ఆశ్ర‌యిస్తారు. రోజువారీగా టిక్కెట్లు కొనుక్కోకుండా నెల‌వారీ పాస్‌ల‌ను తీసుకుంటారు. త‌ద్వారా ర‌వాణా చార్జీల్లో రాయితీని కొంత మొత్తం పొందే అవ‌కాశం ముంటుంది. అందుకు అనుగుణంగా ఆర్ట‌సీ సైతం దాదాపు వివిధ ర‌కాల పాస్‌ల‌ను జారీ చేస్తున్న‌ది. ఆర్డిన‌రీ, మెట్రో డిల‌క్స్‌, ఎక్స్‌ప్రెస్‌, కార్గొ, స్టూడెంట్‌, ఎన్‌జీవో త‌దిత‌ర ర‌కాల బ‌స్సు పాస్‌ల‌ను జారీ చేస్తున్న‌ది. మొత్తంగా గ్రేట‌ర్ ప‌రిధిలో ఇలా బ‌స్‌పాస్ సేవ‌ల‌ను వినియోగించుకుంటున్న వారు సుమారు 9 నుంచి 10ల‌క్ష‌ల మంది ఉంటార‌ని అంచ‌నా. వారిద్వారా కోవిడ్‌కు ముందుకు ఆర్టీసికి రోజువారీగానే రూ.80ల‌క్ష‌ల ఆదాయం స‌మ‌కూరేదంటే అర్థం చేసుకోవ‌చ్చు.

ఇదిలా ఉంటే.. బ‌స్‌పాస్ వినియోగ‌దారులు నెల‌వారీగా వాటిని రెన్యువ‌ల్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ప్ర‌త్యేకంగా ఆర్టీసీ డిపో కేంద్రాల‌కు వెళ్లాల్సి ఉండ‌డ‌మే గాక‌, అక్క‌డ గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్‌లో నిల‌బ‌డాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో వినియోగ‌దారుల సౌక‌ర్యార్థం ఆర్టీసీ నూత‌న విధానాన్ని ప్ర‌స్తుతం అమ‌ల్లోకి తీసుకొచ్చింది.ప్రయాణికుల కష్టాలను తగ్గించేందుకు మార్గం సుగమం చేసింది. ఇకపై ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. బస్ పాస్ మీ ఇంటి వద్దకే వస్తుంది. అయితే ఒకే ప్రాంతంలో క‌నీసం ఐదుగురు పాస్ వినియోగ‌దారులు ఉంటేనే ఈ సేవ‌ల‌ను పొందే అవ‌కాశ‌ముంటుంద‌ని నిబంధ‌న‌ను పెట్టింది. బస్ పాస్ కావాలనుకున్న వారు 80082 04216 నెంబర్ కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఏ మారు మూల ప్రదేశంలో ఉన్నా సరే, ఆర్టీసీ సిబ్బంది ఒకరు వచ్చి మీ వివరాలను తెలుసుకుని, బస్ పాస్ ను మీ ఇంటికే వచ్చి అందిస్తారు. అది కూడా ఎలాంటి అద‌న‌పు రుసుముల‌ను వ‌సూలు చేయ‌కుండానే. మరి ఈ సౌకర్యం కల్పించాము కదా అని బస్ పాస్ కౌంటర్లను అయితే ఆర్టీసీ తీసేయలేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఆర్టీసీ ఆర్డినరీ బస్ పాస్ ధర 950 ఉండ‌గా, మెట్రో ఎక్స్ ప్రెస్ ధర రూ.1070, మెట్రో డీలక్స్ బస్ పాస్ ధర రూ.1185, ఎయిర్ పోర్ట్ పుష్పక్ పాస్ ధర 2625, ఎన్జీవో ఆర్డినర్ పాస్ ధర రూ.320 రూపాయలు ఉంది.

సిటీబ‌స్సు ప్ర‌యాణికుల‌కు ఆర్టీసీ సూప‌ర్ బొనాంజా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts