
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయనకు కేవలం కోలీవుడ్‌లోనే కాకుండా.. టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం ఈయన ఓవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు విలన్ రోల్స్ కూడా పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ సేతుపతి ఓ వివాదంలో చిక్కుకున్నాడు.
జనవరి 16న.. అంటే నిన్న విజయ్ సేతుపతి పుట్టినరోజు కావడంతో ఓ సినిమా షూటింగ్లో ఉన్న ఆయన సెట్లోనే బర్త్‌డే కేక్ కట్ చేశాడు. అయితే.. ఆ కేక్‌ను ఓ ఖడ్గంతో కట్ చేయడంతో వివాదంలో చిక్కుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ కాగా.. కొందరు నెటిజన్లు ఆయన తీరును తప్పు పట్టారు. గూండాల మాదిరిగా ఒక ఖడ్గంతో పుట్టిన రోజు కేక్‌కు కట్ చేయడమేంటని కామెంట్లతో హోరెత్తించారు.
ఈ కామెంట్స్ చూసిన విజయ్ సేతుపతి.. తాజాగా అందరికీ క్షమాపణ చెప్పాడు.ప్రస్తుతం తాను నటిస్తున్న `పొన్రం’ సినిమాలో ఖడ్గం కీలక పాత్రను పోషిస్తుందని… అందుకే చిత్ర బృందం తనతో కేక్ ను అలా కట్ చేయించిందని చెప్పాడు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని తెలిపాడు. ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించాలని కోరాడు. మొత్తానికి బర్త్‌డే కేక్ తెచ్చిన తంటాలతో విజయ్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.