
సినిమా ఇండస్ట్రీలో నటి నటులకు అభిమానులే కాకుండా కొందరు వీరాభిమానులు కూడా ఉంటారన్న సంగతి తెలిసిందే. కొందరు తమ అభిమాన హీరోలకు వీరాభిమానులం అని చెప్పుకుంటూ వారి పేర్లను ఒంటి నిండా పచ్చబొట్టు వేయించుకోవడం, లేదంటే వారి కోసం ర్యాలీలు చేయడం, బ్యానర్స్ కట్టి హల్చల్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొంత మంది ప్రాణాలు సైతం కోల్పోతుంటారు. అయితే తమిళ ప్రముఖ స్టార్ హీరో అజిత్‌ను అమితంగా అభిమానించే ప్రకాశ్ అనే అభిమాని సూసైడ్ చేసుకోవడం కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నింపింది.
అజిత్‌ను ఎంతగానో ఇష్టపడే ప్రకాశ్ ఒంటి నిండా నటుడికి సంబంధించిన టాటూలు వేయించుకున్నాడు. అజిత్‌కు సంబంధించిన ఏ ఫంక్షన్లో అయినా అతను చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఏం జరిగిందో కాని అతను ఫిబ్రవరి 24న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంగతిని అజిత్ కుమార్ ఫ్యాన్స్ క్లబ్ ట్విటర్లో షేర్ చేసింది. అజిత్ వీరాభిమానిని మేము కోల్పోయాం. అతని కుటుంబాన్ని ఆదుకోవాలని, వారి అవసరాలకు అండగా ఉండాలని దగ్గరలో ఉన్న అజిత్ ఫ్యాన్స్‌ను కోరుతున్నాం అంటూ వారు కోరారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తున్నాం అని ఫ్యాన్ క్లబ్ తమ ట్వీట్ ద్వారా పేర్కొంది. అయితే అజిత్ అభిమాని సూసైడ్ చేసుకొని మరణించాడని తెలుసుకున్న నెటిజన్స్ మాత్రం ఎలాంటి సమస్యక చావు పరిష్కారం కాదని అంటున్నారు.