
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీని దర్శకత్వంలో `బిబి3` వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత వీరి కాంబో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్.. ఇప్పటి వరకు సినిమా టైటిల్ మాత్రం వెల్లడించలేదు.
దీంతో ఈ సినిమా టైటిల్ ఏంటా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కానీ, ఇప్పటికే మోనార్క్, డేంజర్ వంటి పేర్లు వినిపించినా.. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం హాలీవుడ్ మూవీ టైటిల్ అయిన `గాడ్ ఫాదర్`కు బాలయ్య మరియు బోయపాటి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. చిత్ర యూనిట్ మొత్తానికి గాడ్ ఫాదర్ నచ్చడంతో..దీన్నే ఫైనల్ చేసినట్టు టాక్. ఇక త్వరలోనే టైటిల్‌పై ప్రకటన కూడా రానుందట.