
నేటి సమాజంలో పిల్లలకు చదువులు అంటే లక్షలతో కూడుకున్న పని. కానీ అలాంటి ఓ మాస్టర్ ఒక్క రూపాయికే నాణ్యతమైన విద్యను అందిస్తున్నాడు. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్ శరణ్ రిటైర్మెంట్ తీసుకుని భావిభారత పౌరులకు పాఠాలు నేర్పుతున్నాడు. అదికూడా ఒక్కరూపాయి ఫీజుతో.. వినటానికి ఆశ్యర్యంగా ఉంది కదా.
తన తండ్రి ఏర్పాటు చేసిన పాఠశాల కొన్ని కారణాల వల్ల మూతపడగా.. లోకేశ్ తన ఇంటి ముందున్న వాకిట్లోనే పిల్లలకు క్లాసులు చెబుతున్నాడు. పేద విద్యార్థులకు తనవంతు సాయంగా ఒక్కరూపాయి ఫీజు తీసుకుంటూ పాఠాలు చెబుతున్నట్లు లోకేశ్ తెలిపారు. లోకేశ్ తండ్రి కూడా ఒకప్పుడు టీచర్ గా పనిచేసి 1983లో సొంతంగా సైనిక్ విద్యాలయం పేరుతో ఒక పాఠశాల ప్రారంభించారు. లోకేశ్ ఈ పాఠశాలలోనే పిల్లలకు పాఠాలు నేర్పేవాడట. ఈ క్రమంలోనే పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని తెలుసుకుని ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాడు. లోకేశ్ కథనాలు, అధ్యయనాలు నచ్చి ఒక పత్రిక తనను జర్నలిస్ట్‌గా నియమించుకుంది.
అతి తక్కువ ఫీజు తీసుకోవటంతో లోకేశ్ కుటుంబం ఆ పాఠశాలకు మౌలిక వసతులు చేకూర్చలేకపోయింది. విద్యార్థుల సంఖ్య క్రమం క్రమంగా తగ్గుతూ వచ్చింది. చివరికి పాఠశాల మూతపడింది. కానీ పేద విద్యార్థులకు చదువు చెప్పాలనే ఆశయం మాత్రం లోకేశ్‌లో అలానే ఉంది. ఈ కారణంగానే లోకేశ్ వృద్ధాప్యం వచ్చినా తన వాకిట్లో విద్యార్థులకు ఒక్క రూపాయి ఫీజు తీసుకుని చదువు చెబుతున్నాడు.
దీంతోపాటు సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే వాళ్లకు సలహాలు సూచనలు ఇవ్వటం, సంస్కృతిక కార్యకలాపాల్లో విద్యార్థులను తీర్చిదిద్దటం వంటివీ కూడా లోకేశ్ చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో పాఠశాలలు మూతపడినట్లు లోకేశ్ వాకిట బడి కూడా మూతపడింది. కానీ ఆన్లైన్ క్లాసులు నిర్వహించి పాఠాలు చెప్పినట్లు లోకేశ్ తెలిపారు. తన కుమారుడితో పాటు ఏ ఊరు వెళ్లినా అక్కడ కూడా వారం రోజుల పాటు పాఠశాలలో పిల్లలు విద్యాబుద్ధులు నేర్పిస్తాడని కుటుంభీకులు తెలిపారు.