ప్రేమించి పెళ్లిచేసుకున్నోడే కాల‌య‌ముడ‌య్యాడు..!

February 23, 2021 at 8:06 am

సాంకేతిక అభివృద్ధిలో స‌మాజం ఎంత ముందుకు దూసుపోతున్న కొన్ని దురాచారాలు మాత్రం చెరిగిపోవ‌డం లేదు. భార‌తీయ స‌మాజంలో ఉన్న అలాంటి నీచ‌సంస్కృతిలో వ‌ర‌క‌ట్నం ఒక‌టి. దాని కాటుకు ఎంతో మంది అబ‌ల‌లు ప్రాణాల‌ను కోల్పోయారు. ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి. ఎన్ని చ‌ట్టాలు చేసినా ఇప్ప‌టికీ అవి య‌థేచ్చ‌గా కొన‌సాగుతుండ‌డం శోచ‌నీయం. తాజాగా అలాంటి వ‌ర‌క‌ట్న హ‌త్య వెలుగు చూసింది. ఇక్క‌డ అన్నింటికి మించిన విషాద‌మేమిటంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నోడే కాల‌య‌ముడిగా మార‌డం. నువ్వులేక నేను లేన‌న్నాడు. బాస‌లెన్నో చేశాడు. పెద్ద‌ల‌ను ఒప్పించి మ‌రీ పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్లు గడవకముందే ఆ ఇల్లాలిని తల్లిదండ్రులతో కలిసి అదనపు కట్నం కోసం భార్య‌ను వేధించడం మొదలు పెట్టాడు. ప్రేమించినోడే వేధిస్తుండడాన్ని తట్టుకోలేకపోయిన ఆ ఇల్లాలు పదో అంతస్థు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ఘటన జ‌రిగింది. బాధితులు, పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం..

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన సత్యసంతోషి, పవన్ భగవాన్ ఇరువురూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి మరీ మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వివాహ సమయంలో సత్య సంతోషి తల్లిదండ్రులు మూడు తులాల బంగారంతో పాటు, రూ.50వేల నగదును కట్నంగా ఇచ్చారు. పెళ్ల‌య్యాక భర్త, అత్తమామలతో కలిసి మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ సాయినగర్ కాలనీలో దంప‌తులు ఇద్ద‌రూ నివాస‌ముంటున్నారు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల కాలం నుంచి అద‌న‌పు కట్నం తేవాలంటూ సత్యసంతోషిని అత్తమామలతో పాటు భర్త భ‌గ‌వాన్ వేధించ‌డం మొద‌లు పెట్టారు. వాటిని భ‌రించ‌లేక సత్య సంతోషి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే నిర్ణ‌యానికి వచ్చింది. వారుండే ఇంటికి దగ్గరలో నిర్మిస్తున్న డ‌బుల్ బెడ్రూం ఇళ్ల స‌ముదాయం పదో అంతస్థుకు ఎక్కి, అక్క‌డి నుంచి కిందకు దూకేసింది. నెత్తుటి మ‌డుగులో అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించింది. కుమార్తె ఆత్మహత్య విష‌యం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు బోరు విలపించారు. ఈ ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తును చేప‌ట్టారు.

ప్రేమించి పెళ్లిచేసుకున్నోడే కాల‌య‌ముడ‌య్యాడు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts