
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుపైనే ఏపీ కేబినెట్ ప్రధానంగా చర్చించింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాల కేలండర్ కు మంత్రివర్గం ఆమోదం తెలపడమే కాకుండా కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. వైఎస్ఆర్ చేయూత, కాపునేస్తం, నేతన్న నేస్తం మాదిరిగా మరో కీలక పథకాన్ని రంగంలోకి దీంచింది
అయితే అగ్రవర్ణ పేదలకు కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్టు మంత్రి పేర్నినాని తెలిపారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మీడియాతో నాని మాట్లాడుతూ.. రూ.670 కోట్లతో ఈబీసీ నేస్తం పథకానికి కేబినెట్ ఆమోదముద్ర వేసిందని పేర్నినాని తెలిపారు. 45-60 ఏళ్ల ఈబీసీ మహిళలకు మూడేళ్లపాటు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందుతున్నారు. నవరత్నాల అమలు క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 23 రకాల సంక్షేమ పథకాలకు నెలవారీగా షెడ్యూల్ ప్రకటించారు. 5.69 కోట్ల మంది పేదలకు క్యాలెండర్ ప్రకారం పథకాలు అమల చేయనున్నట్టు తెలిపారు. జగనన్న విద్యా దీవెనలో సంపూర్ణంగా బోధనా ఫీజు చెల్లింపులు ఉంటాయన్నారు.