
రోజురోజుకూ మనుషులు తెలివి మీరుతున్నారు. తమ అవసరాల కోసం ఎంతటి నీచానికైనా తెగబడుతున్నారు. వక్రమార్గం పడుతున్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఈ సంఘటన. మూడు నెలలుగా ఇంటి అద్దె చెల్లించకపోవడమేగాక, ఇదేమిటని నిలదీసిన యజమాని ప్రాణాలనే బలిగొంది ఓ కుటుంబం. అక్కడితో ఆగకుండా వారే తిరిగి సదరు యజమాని కొడుకుపై అత్యాచారం కేసు పెడతానని బెదిరించడం కొసమెరుపు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో వెలుగుచూసింది. అధికారులు, బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. బెంగుళూరు రాష్ట్రం కుందనహళ్లికి చెందిన ఇంటి వెంకటరెడ్డికి చెందిన మారతహళ్లిలోని భవనాన్ని పీజీ హాస్టల్ నిర్వహించడానికి రాజస్థాన్‌కు చెందిన భువన, విశాల్ 8 ఏళ్ల క్రితం అద్దెకు తీసుకున్నారు. ఇటీవల కొంత కాలం నుంచి అద్దె కట్టడం లేదు. ఎప్పుడు అడిగినా రేపూమాపంటూ తాత్సారం చేస్తూ వస్తున్నారు. దీంతో ఓపిక నశించిన వెంకట్‌రెడ్డి కిరాయిదారులను గట్టిగా నిలదీశాడు. దీంతో వారు ఎదురుతిరగడమే కాకుండా, అత్యాచారం కేసు పెడతానని సదరు మహిళ భువన బెదిరించింది. దీంతో భయాందోళనకు గురైన వెంకటరెడ్డి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు వారిద్దరినీ అరెస్టు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. అద్దె అడిగిన యాజమానిని ఏకంగా ఓ కుటుంబం కిరాతకంగా హతమార్చింది. బెంగళూరులోని వీవీపురానికి చెందిన రాజేశ్వరి అనే మహిళకు బసప్ప సర్కిల్ దగ్గర్లోని ఎంవీ లైన్లో మొత్తం ఎనిమిది ఇళ్లున్నాయి. వాటిని అద్దెలకిచ్చుకుంటూ రాజేశ్వరి జీవిస్తున్నది. అందులో ఓ ఇంట్లో పాషా తన కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటూ, క్యాటరింగ్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్ని నెలలుగా కరోనా కారణంగా బిజినెస్ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. గత మార్చి నుంచి అద్దె కట్టకుండా రాజేశ్వరి అడిగినప్పుడల్లా రేపూమాపంటూ దాటవేస్తూ వచ్చారు. ఇదే విషయమై రాజేశ్వరి ఇటీవల గట్టిగా నిలదీసిన రాజేశ్వరిని పాషా(26), పాషా నానమ్మ అస్రఫ్ఉన్నిసా(65), పాషా సోదరుడు జిలాన్(20) అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఆమెను చంపి మూటకట్టి ఆటోలో కుంబాలగోడు వైపు తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. రాజేశ్వరి కుమారుడు దీపక్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు నిజాలు వెలుగుచూశాయి. పాషా, అతని సోదరుడు, నానమ్మపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.