
సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం రవాణా కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇక వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలో చిరునామా మార్పు.. ఇలా వివిధ రకాల సేవల కోసం మనం ఆర్టీఏ కార్యాలయాలకు వెళుతుంటాం. అయితే ఇప్పటికే ఈ శాఖకు చెందిన అనేక సేవలను ఆన్లైన్ చేశారు. కానీ కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే మార్చి నెల నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అనేక రవాణా సేవలు దాదాపుగా ఆన్లైన్లోనే లభ్యం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది.
అయితే ఇప్పటి వరకు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో 90 శాతం వరకు ఆర్టీవో సేవలను ఆన్లైన్లోనే అందించారు. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తే ఆధార్ కార్డు సాయంతో వాహన తాత్కాలిక రిజిస్ట్రేషన్, లెర్నింగ్ లైసెన్స్ తదితర సేవలను ఇంటి నుంచే పొందవచ్చు. రవాణాశాఖకు సంబంధించి మొత్తం 16 సేవలను ఆన్లైన్ ద్వారా పొందే విధంగా ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల నుంచి సలహాలు, అభ్యంతరాలను 15 రోజుల్లో తెలియజేయాలని కోరినట్లు సమాచారం.
అనంతరం ముసాయిదా తయారు చేసి ఫిబ్రవరి లేదా మార్చి నుంచి అమలు చేసే అవకాశముందని తెలుస్తోంది. కొత్త విధానం అమల్లోకి వస్తే ఆన్లైన్లో పొందే సేవల్లో ప్రధానంగా.. కొత్త లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్, రెన్యూవల్, డూప్లికేట్ డీఎల్, డీఎల్లో చిరునామా మార్పు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్, తాత్కాలిక వాహన రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ కోసం ఎన్వోసీ, డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వాహన బదిలీలాంటి సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.