
అనుమానమనే పెనుభూతం పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నది. నిండు జీవితాలను బలితీసుకుంటున్నది. భర్తను భార్య కడతేర్చడమో, లేక భార్యను భర్తే అంతమొందించడమో జరుగుతున్నది. తాజాగా అలాంటి సంఘటన తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానపడి భార్యనే కడతేర్చాడు ఓ భర్త. ఆ తర్వాత నేరుగా పోలీసులకు లొంగిపోయాడు. అధికారులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన 45 ఏళ్ల శంకరయ్య ముంబాయిలోని కల్లు దుకాణంలో పనిచేస్తుంటాడు. అతడికి 37ఏళ్ల వయసున్న భార్య సుజాత, 12 ఏళ్ల వయసులోపు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కుటుంబమంతా చర్లపల్లిలోనే ఉంటుండగా, శంకరయ్య మాత్రం ముంబాయిలో ఉంటూ, అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు.
ఇదిలా ఉండగా.. తాను వేరే ప్రాంతంలో ఉంటుండడంతో తన భార్య మరోవ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానం ఇటీవల శంకరయ్యలో మొదలైంది. అప్పుడప్పుడు ఫోన్లోనూ, ఇంటికి వచ్చినప్పుడు ఆమెతో గొడవపడేవాడు. ఆమెను కొట్టేవాడు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి ఇక్కడే ఉండిపోయాడు. అప్పటి నుంచీ ప్రతీరోజూ ఆమెతో ఏదో ఒక కారణంతో గొడపడేవాడు. శంకరయ్యలో అనుమానం మరింత పెరిగిపోయింది. అంతే భార్యను చంపాలన్న నిర్ణయానికి వచ్చేశాడు. సోమవారం తెల్లవారుజామున భార్య సుజాత బాత్రూంలోకి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన శంకరయ్య గొడ్డలి తీసుకుని ఆమె వెనకాలే బాత్రూంలోకి వెళ్లాడు. ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేయగా, ఆమె అక్కడికక్కడే మరణించింది. ఇక తెల్లారే వరకు శంకరయ్య బాత్రూం గుమ్మం వద్దే కూర్చుండిపోగా, ఉదయం ఈ ఘటనను చూసిన పిల్లలు, స్థానికులు హతాశులయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా అధికారులు అరెస్టు చేశారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.