క్రిస్ట‌ల్ బాల్ తో రూ.2కోట్ల న‌ష్టం.. ఎలాగంటే..

March 16, 2021 at 12:49 pm

చిన్న‌త‌నంలో మ‌నంద‌రం ఆడుకున్న ఆట గుర్తున్న‌దా. భూత‌ద్దాన్ని సూర్యుడికి అడ్డుగా పెట్టి నిప్పును పుట్టించిన విష‌యం అంద‌రికీ అనుభ‌వంలో ఉన్న‌దే. ఇప్పుడు అలాగే ఓ క్రిస్ట‌ల్ బాల్ కార‌ణంగా మంట‌లు లేచాయి. ఏకంగా రూ.2కోట్ల న‌ష్టం వాటిల్లింది. ఈ సంఘ‌ట‌న అమెరికాలోని విస్కాన్సిన్‌లో జరిగింది. వివ‌రాల్లోకి వెళ్ల‌తే.. డెల్టాన్ టౌన్‌లోని సౌక్ కౌంటీ‌లో గల ఫాక్స్ హిల్ రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో గత ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఉన్నట్టుండి మంటలు అంటుకున్నాయి. మార్నింగ్ డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన యజమాని లోపలి నుంచి దట్టమైన పొగలు రావడం గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి అధికారులు మంట‌ల‌ను ఆర్పివేశారు. అయితే అప్ప‌టికీ న‌ష్టం జ‌రిగిపోయింది. ఇంట్లో ఉన్న 2.50ల‌క్ష‌ల డాల‌ర్లు (రూ.2కోట్లు) విలువ చేసే ఇంటి సామ‌గ్రితో ఇత‌ర వ‌స్తువులు కాలిబూడిద‌య్యాయి.

ఇదిలా ఉంటే తొలుత ఈ అగ్ని ప్ర‌మాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చని అధికారులు భావించారు. కానీ, ఇంటి ప‌రిస‌రాల‌ను క్షుణ్ణంగా పరిశీలించి చూసిన అధికారులకు షాకింగ్ విషయం తెలిసింది. క్రిస్టల్ బాల్(గాజు బంతి) కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. అదెలాగంటే ఇంటి కిటికీ ద్వారా ప్రసారమైన సూర్యరశ్మి బెడ్డు పక్కన ఓ టేబుల్‌పై ఉన్న క్రిస్టల్ బాల్‌పై పడింది. అనంతరం క్రిస్టల్ బాల్‌పై పడిన కాంతి పరావర్తనం చెంది నేరుగా బెడ్డుపై పడడంతో అగ్గి పుట్టింది. దీంతో నిమిషాల వ్యవధిలోనే ఇంట్లోని మిగతా వస్తువులకు మంటలు అంటుకోవడం, అవి కాలి బూడిద కావడం జరిగిపోయింద‌ని నిర్ధారించారు.

క్రిస్ట‌ల్ బాల్ తో రూ.2కోట్ల న‌ష్టం.. ఎలాగంటే..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts