24 శాతం పెరిగిన సంపాదన.. మన శ్రీమంతులు ఇవే..!?

March 3, 2021 at 2:08 pm
money

కరోనా క్లిష్ట సమయంలో భారత్ లో ధనవంతుల సంఖ్య పెరిగింది. పెట్టుబడులను ఆకట్టుకోవడంలోనే కాదు.. సంపద సృష్టిలోనూ హైదరాబాద్‌ సత్తా చాటుతున్నది. తాజా హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2021లో హైదరాబాద్‌కు చెందిన 10 మంది బిలియనీర్లకు చోటు లభించింది. అయితే ఈ ఏడాది జనవరి 15 నాటికి వీరందరి సంపద రూ.1,65,900 కోట్లుగా ఉన్నది. ఇక ఇందులో ఏడుగురు ఫార్మా రంగానికి చెందినవారే కావడం గమనార్హం. మిగతావారు మౌలిక, నిర్మాణ రంగాలకు చెందినవారున్నారు.

ఇక టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ సంపద అత్యధికంగా 197 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. తర్వాత 189 బిలియన్‌ డాలర్లతో అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ ఉన్నారు. మూడో స్థానంలో 114 బిలియన్‌ డాలర్లతో ఎల్‌వీఎంహెచ్‌ సారథి బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ఉన్నారు. కాగా, ప్రపంచ టాప్‌-10 కుబేరుల్లో భారత్‌ నుంచి ముకేశ్‌ అంబానీకి మాత్రమే చోటు దక్కింది.

అయితే దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్‌ అతలాకుతలం చేసినా.. సంపద సృష్టి మాత్రం ఆగలేదు. గతేడాది భారత్‌లో కొత్తగా 40 మంది బిలియనీర్లు పుట్టుకొచ్చారని హురున్‌ అంతర్జాతీయ ధనవంతుల జాబితా-2021లో వెల్లడైంది. మంగళవారం విడుదలైన ఈ వివరాల ప్రకారం దేశంలో 177 మంది బిలియనీర్లున్నట్లు తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న భారత సంతతీయులతో కలిపితే ఇది 209 మందికి చేరుతున్నది. ఈ ఏడాది జనవరి 15 నాటికి దేశంలోని వ్యక్తులు, కుటుంబాల సంపద ఆధారంగా భారతీయ జాబితాను హురున్‌ రూపొందించింది.

ఇక ఇందులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఈయన సంపద విలువ రూ.6.09 లక్షల కోట్ల (83 బిలియన్‌ డాలర్లు)పైనే. రెండో స్థానంలో అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ ఉన్నారు. 2020లో అంబానీ సంపద 24 శాతం ఎగబాకింది. అదానీ కూడా ఈసారి 20 స్థానాలు ఎగిసి అంతర్జాతీయంగా 48వ స్థానంలో నిలిచారు. ఆయన సోదరుడు వినోద్‌ అదానీ సంపద 128 శాతం పెరిగి రూ.71,912.4 కోట్లకు చేరింది.

అంతేకాక ఐటీ రంగ కుబేరుల్లో శివ్‌ నాడార్‌ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో అజీమ్‌ ప్రేమ్‌జీ, ఎస్‌ గోపాలకృష్ణన్‌, ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి ఉన్నారు. బిలియనీర్లలో ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందినవారే 37 మంది ఉన్నారు. ఆ తర్వాత అత్యధికంగా కన్జ్యూమర్‌ గూడ్స్‌ (27), కెమికల్స్‌ (19), సాఫ్ట్‌వేర్‌-సేవలు (14), ఆటోమొబైల్‌ (13) రంగాల్లో ఉన్నారు. ప్రపంచ కుబేరుల్లో చైనా, అమెరికా తర్వాత భారత్‌ 3వ స్థానంలో ఉన్నది.

24 శాతం పెరిగిన సంపాదన.. మన శ్రీమంతులు ఇవే..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts