వైరల్: మీకు పెట్రోలు ఫ్రీగా కావాలా .. ఐతే పద్యాలు చెప్పండి..!

March 7, 2021 at 3:55 pm

ఒక వైపు రోజు రోజుకు పెట్రోలు ధరలు మండిపోతున్నాయని రోజూ పత్రికలూ, టీవీల్లో వార్తలు వస్తుంటే, తమిళనాడు లోని కరూరు నాగపంపల్లికి చెందిన ఓ పెట్రోలు బంకు ఓనర్ తమ దగ్గరకు వచ్చే కస్టమర్లకు లీటరు పెట్రోలు ఫ్రీగా ఇస్తున్నాడు. కానీ దానికి ఆయన ఒక్క చిన్న షరతు పెట్టాడు. అది ఏంటంటే, ఆ బంకుకు వచ్చే కస్టమర్ల పిల్లలు కనీసం పది నుంచి ఇరవై పద్యాలు చెప్పాలి. మనకు వేమన శతకంలా తమిళంలోనూ తిరువళ్లువర్‌ రాసిన తిరుక్కురల్‌ పద్యాలు ఉంటాయి. రెండు పదాల్లో ఉండే ఆ పద్యాల్లో ఎన్నో జీవిత సత్యాలుంటాయనీ అవి పిల్లలు నేర్చుకోవాలనే మంచి ఉద్దేశంతోనే ఆ పద్యాలు చెప్పిన వారికి పెట్రోలు ఫ్రీగా ఇస్తున్నాననీ చెబుతున్నాడు ఆ బంకు ఓనర్ సెంగుట్టువన్‌. ఆయన స్థానికంగా ఉండే వళ్లువర్‌ కాలేజ్‌ ఆఫ్‌ సెన్స్‌ అండ్‌ మానేజ్‌మెంట్‌కు ఛైర్మన్‌. పిల్లల్లో చదివే అలవాటు పెంచాలనే మంచి ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడట.

ఒకటి నుంచి పదకొండో తరగతి చదివే పిల్లలు ఎవరైనా సరే తమ తల్లిదండ్రులతో ఆ బంకుకు వచ్చి పది నుంచి ఇరవై పద్యాలను ఆయనకు అప్పచెబితే చాలు ఉచితంగా పెట్రోల్ ఇస్తారు. పది పద్యాలకు అర లీటరు, ఇరవై చెబితే లీటరు పెట్రోలు ఉచితంగా పొందవచ్చు. ఆయన కాలేజీలో చదివే విద్యార్థులు కూడా మొత్తం 1330 తిరుక్కురల్‌ పద్యాలను ఒకేసారి చెప్పిన వాళ్ళకి మూడేళ్లు ఉచితంగా చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌ కూడా ఇస్తున్నాడు ఆయన. ఇంకా ఇలా అందుకునే విద్యార్థులు నెలలో రెండు ఆదివారాలు కాలేజీకి వచ్చి గ్రామీణ విద్యార్థులకు ఆ పద్యాలు నేర్పించాలి. గత 15 ఏళ్లలో 15 మంది విద్యార్థులు ఆ స్కాలర్‌షిప్‌ పొందగా, 150 మంది విద్యార్థులు ఇప్పటి వరులకు పెట్రోలు బంకులో పద్యాలు చెప్పారట.

వైరల్: మీకు పెట్రోలు ఫ్రీగా కావాలా .. ఐతే పద్యాలు చెప్పండి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts