
పాకిస్తాన్ యువ పేసర్ షాహిన్ షా ఆఫ్రిది త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పెద్ద కుమార్తె అక్సా అఫ్రిదితో పాకిస్తాన్ పేసర్ షాహీన్ షా అఫ్రిది నిశ్చితార్థం చేసుకోనున్నారు. అతడు ఏడడుగుల వేయబోతున్న అమ్మాయి పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది పెద్ద కుమార్తె అక్సా అఫ్రిది అని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంపై ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే పాకిస్తానీ మీడియాలో వస్తున్న వార్తల సారాశం ఇలా ఉంది. షాహిద్ అఫ్రిది తండ్రి అయాజ్ ఖాన్ పెళ్లి విషయమై షాహిన్ కుటుంబం వద్ద ప్రస్తావించారని..అందుకు వారు సానుకూలంగా స్పదించారని ఆ దేశ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే షాహిన్ ఇప్పుడిప్పుడే క్రికెటర్‌గా నిలదొక్కుకుంటున్నాడని.. తమ కుమార్తె చదువులు కూడా ఇంకా ముగియలేదని.. ఇప్పట్లో నిశ్చితార్థం ఉండకపోవచ్చని యువ పేసర్ కుటుంబవర్గం తెలిపింది. అయితే వచ్చే రెండేళ్లలో మాత్రం వీరిద్దరి పెళ్లి జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ వార్తపై పాకిస్తానీ జర్నలిస్ట్ ఇతిషామ్ ఉల్ హక్ కూడా క్లారిటీ ఇచ్చారు.. షాహిన్ ఆఫ్రిది, అక్సా అఫ్రిది వివాహ వార్తలు నిజమేనని.. ఇరు కుటుంబాలు ఇప్పటికే పెళ్లికి అంగీకరించాయని చెప్పుకొచ్చారు. వీరిద్దరి నిశ్చితార్థంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తడంతో పాకిస్తాన్ పేసర్ కుటుంబం నుంచి ఈ ధృవీకరణ వచ్చింది. అఫ్రిదికి అక్సా, అన్షా, అజ్వా, అస్మారా, అర్వా అనే ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఐదుగురిలో 20 ఏళ్ల అక్సా పెద్దది. త్వరలోనే వీరి ఎంగేజ్మెంట్ జరగనుంది. అయితే పెళ్లి మాత్రం అక్సా చదువు పూర్తయిన తర్వాత జరగనుందని వెల్లడించారు. కాగా షాహిన్ ఆఫ్రిదితో మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. షాహిన్ లాహోర్ క్యూలాండర్స్ తరుఫున ఆడుతుండగా.. షాహిద్ అఫ్రిది ముల్తాన్ సుల్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా షాహిన్ లీగ్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి సత్తాచాటాడు.