అలర్ట్ : వాట్సాప్ లో ఈ లింక్ ఓపెన్ చేస్తే ఇక అంతే..!

మీకు ప్రైజ్ మనీ వచ్చింది . ఈ లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేసుకోండి. వ్యాక్సిన్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి అంటూ ఇటీవల కొన్ని ఫేక్ లింక్ లు వాట్సాప్ లో బాగా వస్తున్నాయి. ఈ లింక్ పై క్లిక్ చేసి మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తాజాగా వాట్సాప్ లో మరో ఫేక్ లింక్ షేర్ అవుతోంది. వాట్సాప్ పేరు చెప్పే వాట్సాప్ కస్టమర్స్ ని మోసం చేస్తున్నారు కొందరు సైబర్ నేరగాళ్లు. సాధారణంగా కనిపించే ఆకుపచ్చ రంగులో కాకుండా కొత్త రంగులో వాట్సాప్‌ వచ్చేసిందంటూ మెసేజ్ లు పంపుతారు. ఆ కొత్త రంగు వాట్సాప్ ఎలా ఉంటుందో చూద్దామంటూ క్లిక్ చేసిన కొందరు మోసపోతున్నారు.

అచ్చంగా వాట్సాప్ లాగా నమ్మించేలా ఉండే ఆ లింక్ మీకు వస్తే ఆ లింక్ పై క్లిక్ చేయకండి. ఒక వేళ క్లిక్‌ చేస్తే మీరు నమోదు చేసిన సమాచారం అంతా కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇంకా మీ మొబైల్ లో ఉన్న వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు కూడా వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఒక వేళ ఇప్పటికే క్లిక్‌ చేసి ఉంటే నష్ట పోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి మీ ఫోన్‌ను రీసెట్‌ చేస్తే బెటరని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా కస్టమర్ల బ్యాంకు అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్లు, మెయిల్ ఐడీలకు సంబంధించిన పాస్ వర్డ్ లను వెంటనే మార్చుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు.