కరోనా తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్‌ దిశగా జర్మనీ.!

కరోనా కారణంగా తిరిగి కేసులు విజృంభిస్తుండటంతో జర్మనీలో నియంత్రణలను కఠినతరం చేశారు. కేసుల తీవ్రత దృష్ట్యా కొంత కాలం పాటు లాక్‌డౌన్‌ విధించేందుకు ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ అనుకుంటున్నారని ఆమె ప్రతినిధి గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా కొద్దిరోజుల పాటు లాక్‌డౌన్‌ అమలుకు మెర్కెల్‌ సిద్ధంగా ఉన్నారని ఉరిక్‌ డెమ్మెర్‌ పేర్కొన్నారు. తాజా పాజిటివ్‌ కేసులు బాగా పెరగడంతో దేశ ఆరోగ్య వ్యవస్ధ పై ఒత్తిడి పడనుంది. దీని దృష్ట్యా లాక్‌డౌన్‌కు కసరత్తు సాగిస్తున్నామని వారు చెప్పారు.

గత సంవత్సరం నవంబర్‌ నుంచి జర్మనీలో లాక్‌డౌన్‌ తరహా నియంత్రణలు అమల్లో ఉన్నా కూడా కేసుల పెరుగుదలతో మహమ్మారిని అదుపులోకి తీసుకురావడం చాలా క్లిష్టంగా మారింది. మార్చిలో మెర్కెల్‌ సహా పదహారు రాష్ట్రాల నేతలు పాల్గొన్న సమావేశంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కఠిన లాక్ డౌన్‌లు, కర్ఫ్యూ విధించాలనే అభిప్రాయానికి వచ్చారు. దీనితో కరోనా నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు చేపట్టేలా ఇన్ఫెక్షన్‌ ప్రొటెక్షన్‌ చట్టాన్ని సవరించేందుకు మెర్కెల్‌ సిద్ధం అయ్యారు.