పది, ఇంటర్ పరీక్షలపై జగన్ క్లారిటీ..!?

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఓ వైపు రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లి దండ్రులు అంతా పరీక్షలను రద్దు చేయాలి లేదా వాయిదా వేయాలని కోరుతున్నారు. అటు అధికారులు కూడా పరీక్షల నిర్వహణ అసాధ్యం అంటూ అభిప్రాయం పడుతున్నారు. తాజాగా పలు జిల్లాల్లో పదో తరగతి విద్యార్థులకు కరోనా సోకటంతో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇకమీదట తమ పిల్లల్ని స్కూళ్లకి పంపించలేమంటూ లేఖలు రాస్తున్నారు.

ఇలాంటి సమయంలో పరీక్షల నిర్వహణ కష్టమే అనే వార్తలు వస్తున్నాయి. కానీ విద్యార్థుల భవిష్యత్తు అంతా పది, ఇంటర్ సర్టిఫికేట్ల పైనే ఆధారపడి ఉంటుంది అని జగన్ అన్నారు. అందుకే ఆ రెండు పరీక్షలను చాలా బాధ్యతగా తీసుకుని నిర్వహిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు జగన్. ఏపీలో అనుకున్న షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని సీఎం జగన్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.