కేటీఆర్‌పై హెచ్ఆర్‌సీలో మ‌హిళ ఫిర్యాదు..! ఎందుకంటే..

ఇటీవ‌ల మంత్రి కేటీఆర్ వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించారు. రూ.1700 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు. అదేవిధంగా వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పైనా దృష్టిసారించారు. గులాబీ నేత‌ల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించి దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండ‌గా గురువారం ఉద‌య‌మే పుర‌పాల‌క ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు న‌గారా మోగ‌డం గ‌మ‌నార్హం. అద‌లా ఉంచితే మంత్రి కేటీఆర్ పై ఓ మ‌హిళ ఏకంగా మాన‌వ హ‌క్కుల సంఘంలో ఫిర్యాదు చేయ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం సంత‌రించుకుంది. ఎన్నిక‌ల వేళ ఇది ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే..

ఈనెల12న వరంగల్ న‌గ‌రంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సంద‌ర్భంగా లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన ఈసంవెల్లి బేబి అనే మ‌హిళ మంత్రిని క‌లిసిందుకు అక్క‌డి వెళ్ల‌గా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇదే విష‌య‌మై బేబి స్థానిక బీసీ సంఘం నాయకులతో కలిసి మానవ హక్కుల కమిషన్‌ను గురువారం ఆశ్ర‌యించింది. మంత్రి కేటీఆర్‌పై ఫిర్యాదు చేసింది. డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తా అని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ విష‌య‌మై మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు వెళ్లాన‌ని, అయితే త‌న వ‌ద్ద పేపర్లు, ఆధార్ కార్డులు పోలీసులు లాక్కున్నారని క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. లక్ష్మీపురం గ్రామంలో ఉన్న దళిత మహిళలు సమస్యలను పరిష్కరించాలని వెళ్లిన మహిళలపై పోలీసులు లాఠీచార్జ్ చేశార‌ని, తమను సైతం విచక్షణ రహితంగా కొట్టారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. లాఠీచార్జికి కార‌ణ‌మైన కేటీఆర్, పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. మ‌రి దీనిపై క‌మిష‌న్ ఎలా స్పందిస్తుందో చూడాలి.