క‌రోనా ఉధృతి.. బేగంబ‌జార్ మార్కెట్ క‌మిటీ కీల‌క నిర్ణ‌యం

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24గంటల్లో హైదరాబాద్- 398, మేడ్చల్- 214, రంగారెడ్డి- 174, నిజామాబాద్-169, నిర్మల్-100, జగిత్యాల-99, కరీంనగర్-77, వరంగల్ అర్బన్- 74, సంగారెడ్డి- 65, మహబూబ్ నగర్-60, కామారెడ్డి- 58, మంచిర్యాల- 57, నల్గొండ- 54, ఖమ్మం-50 కేసులు న‌మోదు కాగా, రాష్ట్రంలో 2,055 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదే సమయంలో కరోనాతో ఏడుగురు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,18,704కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 1,741 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,362 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 8,263 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

జంట‌న‌గ‌రాల్లో క‌రోనా కేసులు ఉధృత‌మ‌వుతున్న నేప‌త్యంలో బేగంబ‌జార్ మార్కెట్ క‌మిటీ నిర్ణ‌యం తీసుకున్న‌ది. మార్కెట్ ప‌ని స‌మ‌యాల్లో మార్పుల‌ను చేసింది. రేపటినుండి ప్రతిరోజూ సాయంత్రం 5 కే మార్కెట్ బంద్ చేస్తున్నట్టు మార్కెట్ కమిటీ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు మార్కెట్ క‌మిటీ అధ్య‌క్షుడు ల‌క్ష్మీనారాయ‌ణ్ రాఠి గురువారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం సైతం కొవిడ్ నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌ల‌ను చేప‌ట్టింది. పాఠ‌శాల‌ల‌ను మూసి వేసింది. మాస్కుల ధ‌రించ‌కుంటే వెయ్యి జ‌రిమానా విధిస్తున్న‌ది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని ఆంక్ష‌లు విధించే యోచ‌న‌లో ఉన్న‌ది.