దేశంలో క‌రోనా వీర విజృంభ‌ణ‌..కొత్త‌గా 685 మంది మృతి!

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా వైర‌స్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేష‌న్ కూడా ప్రారంభించారు.

ఇదిలా ఉంటే.. భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న మ‌ళ్లీ ల‌క్ష‌కు పైగా న‌మోదు అయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 1,26,789 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,29,28,574 కు చేరుకుంది. అలాగే నిన్న 685 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు.

తాజా లె‌క్క‌ల‌తో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,66,862 ‌కు పెరిగింది. ఇక నిన్న ఒక్క‌రోజే 59,258 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,18,51,393 మంది కోలుకోగా.. 9,10,319 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా క‌రోనా టెస్ట్‌ల సంఖ్య 25,26,77,379 కు చేరుకుంది.