మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అంటూ బురిడి..

April 17, 2021 at 2:35 pm

సైబ‌ర్ నేర‌గాళ్లు రోజుకో తీరును మోసాల‌కు తెగ‌బ‌డుతున్నారు. వినూత్న ప‌ద్ధ‌తుల‌తో నెటిజ‌న్ల‌ను బురిడీ కొట్టిస్తూ క్ష‌ణాల్లో వారి డ‌బ్బును స్వాహా చేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘ‌ట‌నే ఇప్పుడు వెలుగు చూసింది. ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు కార్య‌క్ర‌మం పేరిట బురిడి కొట్టించ‌డం ఇప్పుడు వీక్ష‌కుల‌ను, నెటిజ‌న్ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్‌లో వెలుగుచూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని పంజాగుట్ట కుమ్మరబస్తీకి చెందిన జీ.గోపాల్ రెడ్డి డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి అక్క‌డే నివాసం ఉంటున్నాడు. ఇటీవ‌ల తన మొబైల్ ను కుమారుడు గుణశేఖర్ కు ఇచ్చాడు. ఆ బాలుడు ఆ ఫోన్లో యూట్యూబ్లో వీడియోలు, సినిమాలు చూస్తూ కాల‌క్షేపం చేసి సాయంత్రం పూట తండ్రికి తిరిగి ఫోన్‌ను ఇచ్చేశాడు.

అంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. మ‌రుస‌టి రోజు బ్యాంకు ఖాతాను చెక్‌ను గోపాల్‌రెడ్డి ఒక్క‌సారిగా కంగుతిన్నాడు. త‌న ఖాతా నుంచి 50,100 రూపాయలు మాయమడంతో పాటు, తన ఖాతాలోంచే ఓ గుర్తు తెలియని నెంబర్ ఫోన్ పే ద్వారా డబ్బులు పంప‌డం చూసి బిత్త‌ర‌పోయాడు. వెంట‌నే ఆ నెంబర్ కు ఫోన్ చేయ‌గా స్విచాఫ్ రావ‌డంతో ఆందోళ‌న‌కు గుర‌య్యాడు. వెంట‌నే కుమారుడిని నిల‌దీయ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రోగ్రాంకు సంబంధించిన లాటరీని గెలుచుకున్నారని ఆ నెంబర్ల నుంచి రెండు మెసేజ్ లు వచ్చాయ‌ని, దీంతో వాళ్లకు ఫోన్ చేయ‌గా, రిజిస్ట్రేషన్ చార్జీలనీ, ఇతర వాటికి రూ.16వేలు ఒకసారి, 25వేలు ఒకసారి, 9100 రూపాయలు మరోసారి డబ్బులు పంపాన‌ని, రెండ్రోజుల్లో లాటరీ డబ్బు అకౌంట్లో పడుతుందని చెప్పార‌ని కుమారుడు గుణశేఖర్ అమాయ‌కంగా చెప్పుకొచ్చాడు. అంత‌టితో జరిగిందేంటో గ్రహించిన గోపాల్ ల‌బోదిబోమ‌న్నాడు. ఈ విషయమై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా, అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప‌ట్టారు.

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అంటూ బురిడి..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts