త‌మిళ‌నాడులో రూ.1500కోట్ల విలువైన డ్ర‌గ్స్‌..!

April 21, 2021 at 9:05 pm

దేశంలో మ‌త్తుప‌దార్థాల అక్ర‌మ ర‌వాణా య‌థేచ్ఛ‌గా కొన‌సాగుతున్న‌ది. వేల కోట్ల రూపాయాల డ్ర‌గ్స్ దేశంలోకి చొర‌బ‌డుతున్నాయి. డ్ర‌గ్స్ అక్ర‌మ ర‌వాణాకు స‌ముద్ర‌తీర ప్రాంతాలు, పోర్టులు కేంద్రాలుగా నిలుస్తుండ‌డం విశేషం. తమిళనాడు త‌దిత‌ర ప్రాంతాల్లోని షిప్పింగ్‌ పోర్టులో డ్రగ్స్‌ రవాణా పెరిగింది. ఇటీవ‌ల తరచుగా డ్రగ్స్‌ రవాణా చేయ‌డం, అధికారుల త‌నిఖీల్లో వెలుగుచూడ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. విదేశాల నుంచి నేరుగా డ్రగ్స్‌ రవాణా జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. తాజాగా తమిళనాడులో ప‌ట్టుబ‌డిన డ్రగ్స్‌ను చూసి అధికారులే బిత్త‌ర‌పోయారు. వాటి విలువ వేల కోట్ల ప‌లుకుతుండ‌డం గ‌మ‌నార్హం. వివ‌రాల్లోకి వెళ్తే..

తమిళనాడులోని తూత్తుకుడిలోని వీవోసీ పోర్టుకు శ్రీలంక నుంచి ఇటీవల ఒక నౌకలోని టింబ‌ర్ కంటైనర్లు వ‌చ్చాయి. వాటిని విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా అధికారులు తనిఖీ చేస్తుండగా ఈ స్మగ్లింగ్‌ వ్యవహారం బయటపడింది. టింబర్‌ కంటైనర్‌లో ఉన్న బ్యాగుల్లో సుమారు 4వందల కేజీలు కొకైన్ బ‌య‌ట‌ప‌డ‌డంతో వారు నివ్వెర పోయారు. సుమారు దాని విలువ రూ.1500 కోట్ల రూపాయలు ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. అనంత‌రం ఆ కొకైన్‌ను రెవిన్యూ ఇంటిలిజెన్స్‌ డైరెక్టరేట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా శ్రీ‌లంక‌కు చెందిన నౌక‌ను సీజ్ చేశారు. అయితే ఆ కొకైన్‌‌ను త‌ర‌లించిన కంటైన‌ర్ ఎవ‌రిది? ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? ఎవ‌రు? ఎవ‌రికి స‌ర‌ఫ‌రా చేస్తున్నారు? త‌దిత‌ర విష‌యాల‌పై చెన్నై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇందులో పోర్టు ఉద్యోగులు, నౌక సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

త‌మిళ‌నాడులో రూ.1500కోట్ల విలువైన డ్ర‌గ్స్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts