ఫీజ‌యినా చెల్లించండి.. లేదంటే కిడ్నీల‌ అమ్మ‌కానికి అనుమతివ్వండి..!

April 15, 2021 at 3:21 pm

పిల్ల‌ల చ‌దువు కోసం త‌ల్లిదండ్రులు ఎన్ని త్యాగాల‌కైనా సిద్ధ‌ప‌డ‌తారు. ప్రాణాల‌ను సైతం ఫ‌ణంగా పెడ‌తారు. త‌మ చెమ‌ట‌నే కాదు ర‌క్తాన్ని కూడా ధార పోసేందుకు వెన‌కాడారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. త‌మ కూతురు ఎంబీబీఎస్ చదువు కొనసాగించడానికి పరీక్ష పీజు కట్టేందుకు డబ్బులు లేకుండా పోయాయ‌ని, ఏకంగా తమ అవయవాలను అమ్ముకోవడానికి సిద్ధ‌ప‌డ్డారు ఆ త‌ల్లిదండ్రులు. అందుకోసం అనుమతి ఇవ్వాల‌ని వారు ఏకంగా అధికారుల‌ను ఆశ్ర‌యించ‌డం సంచ‌ల‌నంగా మారింది. త‌ల్లిదండ్రుల ద‌య‌నీయ ప‌రిస్థితికి అద్దం ప‌డుతున్న‌ది. ఈ ఘటన అనంతరపురంజిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే..

అనంతరపురం జిల్లా హిందూపురానికి చెందిన మక్బుల్‌జాన్ దంపతులు తమ కుమార్తె రుబియాను ఎంబీబీఎస్ చదివించడానికి 16 నెలల క్రితం ఫిలిప్పీన్స్‌ పంపించారు. ప్రస్తుతం కుమార్తె వైద్య విద్య రెండో సంవత్సరం చదువుతోంది. విదేశీ విద్యకు ఏపీ ప్రభుత్వం అందించే ఉపకారవేతనం ఇప్పటి వరకూ అందలేదు. ఇదేవిష‌య‌మై మక్బుల్‌జాన్‌ గత రెండు నెలలుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగారు. ఇప్పటికే ఈ విషయంపై హిందూపురం తహసీల్దార్‌ కార్యాలయం దగ్గర దీక్ష కూడా చేశారు. దీంతో న్యాయం చేస్తామని తహసీల్దార్‌ హామీ ఇవ్వడంతో అప్పట్లో దీక్ష విరమించారు. కానీ, ఇంత వరకు ఎలాంటి సమాచారం రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే కుమార్తె చదువుకోసం ఇల్లు అమ్మాలి అనుకున్నా కొన్ని అడ్డంకులు ఎదురవ‌డంతో అదీ ముందుకు సాగ‌లేదు. మ‌రోవైపు ప‌రీక్ష‌లు రాయాలంటే ఈ నెల 17వ తేదీలో ఫీజు చెల్లించాల్సి ఉంది. దీంతో తమ కుమార్తె చదువు ఆగిపోతుందని ఆవేదన చెందిన తల్లిదండ్రులు.. చివరకు ఏకంగా తమ కిడ్నీలు అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. అందుకు అనుమతివ్వాలంటూ అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు మొరపెట్టుకున్నారు. ఒకవేళ, ప్రభుత్వం స్కాలర్‌షిప్ మంజూరు చేయకపోతే.. తమ కిడ్నీలు అమ్ముకుని కూతురు ఫీజు చెల్లించుకుంటానని మక్బుల్ జాన్ పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తమ కిడ్నీలు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని.. లేకుంటే కనీసం తమ కుమార్తె విద్య కోసం ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పుడిది రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్న‌ది.

ఫీజ‌యినా చెల్లించండి.. లేదంటే కిడ్నీల‌ అమ్మ‌కానికి అనుమతివ్వండి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts