`వ‌కీల్ సాబ్‌` రివ్యూ..ప‌వ‌న్ పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ అదిరింది!‌

చిత్రం : `వ‌కీల్ సాబ్‌`
నటీనటులు: ప‌వ‌న్ క‌ళ్యాణ్, శ్రుతి హాస‌న్‌, నివేత థామస్, అంజలి, అన‌న్య నాగ‌ల్ల‌, ప్రకాష్ రాజ్‌ త‌దిత‌రులు
ద‌ర్శ‌కుడు : వేణు శ్రీ‌రామ్‌‌
సంగీతం: ఎస్. థమన్
నిర్మాత‌లు : దిల్ రాజు – బోణి కపూర్
విడుద‌ల తేదీ : ఏప్రిల్ 9, 2021

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాదాపు మూడేళ్ల త‌ర్వాత న‌టించిన చిత్రం `వ‌కీల్ సాబ్‌`. బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్‌` చిత్రానికి ఇది రీమేక్‌. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ప‌వ‌న్ లాయ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ప‌వ‌న్ రీ ఎంట్రీ మూవీ కావ‌డంతో.. వ‌కీల్ సాబ్‌పై అభిమానుల‌తో పాటు సినీ తార‌ల్లో కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌రి ఈ రోజే (ఏప్రిల్ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన వ‌కీల్ సాబ్ ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

క‌థ‌: కె సత్యదేవ్(పవన్ కళ్యాణ్) ప్ర‌జ‌ల కోసం ఏదైనా చేయాలి.. సామాన్యుల‌కి ఏ విష‌యంలోనూ అన్యాయం జ‌ర‌గ‌కుండా చూడాలి అనే అలోచ‌న‌ల‌తో లాయ‌ర్ అవుతారు. ఇదే స‌మ‌యంలో శ్రుతి హాస‌న్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ, త‌న జీవితంలో జ‌రిగిన కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల లాయ‌ర్ వృత్తిని వ‌దిలేసి..హైదరాబాద్ లోని ఓ ఏరియాలకు షిఫ్ట్ అవుతాడు. అయితే అదే ఏరియాలో ఉంటున్న అంజలి, నివేత థామస్ మరియు అనన్యలు ఎంపీ కొడుకు అండ్ బ్యాచ్ ని కొట్టి పారిపోయిన కేసులో ఇరుక్కుంటారు. ఈ కేసులో నివేతని జైల్లో పెడతారు. ఎంపీ తన పలుకుబడితో నివేతకి బెయిల్ రాకుండా చేస్తుంటాడు. దీంతో అంజ‌లి, అన‌న్య‌లు నివేత‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా.. ఈ కేసు స‌త్య‌దేవ్ దృష్టి వెళ్తుంది. ఈ క్ర‌మంలోనే స‌త్య‌దేవ్ అంజ‌లి వాళ్ల‌కు ప‌లు సూచ‌న‌లు ఇస్తూ సాయం చేస్తుండ‌గా.. ఈ విష‌యం తెలుసుకున్న ఎంపీ రౌడీల‌ను పంపి స‌త్యదేవ్‌ను బెదిరిస్తారు. అప్పుడు సీరియ‌స్‌గా తీసుకున్న స‌త్య‌దేవ్‌.. రంగంలోకి దిగి ఈ కేసును టేక‌ప్ చేస్తాడు. మ‌రి స‌త్య‌దేవ్ నివేత‌ను ర‌క్షించాడా? లేదా? ఇంత‌కీ ఏ ఏ కార‌ణాల వ‌ల్ల నివేత, అంజలి, అనన్యలను ఎంపీ ఇరికించారు? అస‌లు స‌త్య‌దేవ్ లాయ‌ర్ వృత్తిని ఎందుకు వ‌దిలేశాడు? స‌త్య‌దేవ్ భార్య ఏమైంది? స‌త్య‌దేవ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటీ? త‌న‌కు సంబంధం లేని ఆ ముగ్గురు అమ్మాయిల కోసం స‌త్య‌దేవ్ ఎందుకు పోరాటం చేశాడు? అన్న‌దే వ‌కీల్ సాబ్ క‌థ‌.

కథనం-విశ్లేషణ: కథను స్లోగా మొదలుపెట్టిన ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్‌.. ఇంటర్వెల్ వచ్చేసరికి గ్రిప్పింగ్‌గా ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే ఒరిజినల్ కథకి ఏ మాత్రం డామేజ్ కలగకుండా పవన్ కళ్యాణ్ పాత్రని ఎస్టాబ్లిష్ చేసిన విధానం చాలా బాగుంది. ఈ విషయంలో ద‌ర్శ‌కుడిని మెచ్చుకొని తీరాలి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది.. సినిమాకు హైలైట్ అదే అన‌డంలో సందేహ‌మే లేదు.

సెకాండాఫ్‌లో పవన్, ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే కోర్ట్ రూమ్ సన్నివేశాలు, సమాజంలో ఆడవారి పట్ల ఉన్న చెడ్డ ఆలోచనల గురించి ఆలోచన చేసేవిగా ఉంటాయి. ఇక కథనం కాస్త నిమ్మదిగా ఉండటం ఈ చిత్రానికి మైనస్. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కథనం మ‌రీ స్లోగా సాగుతుంది. మ‌రియు కొన్ని రెగ్యులర్ సీన్స్ కాస్త బోరింగ్‌గా ఉంటాయి. కానీ, కథ మాత్రం ఎంగేజింగ్‌గా కట్టిపడేస్తుంది. ఎమోష‌న‌ల్ అండ్ యాక్ష‌న్ సీన్స్ కూడా ఆక‌ట్టుకుంటాయి.

నటీనటులు: ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల పెర్ఫార్మన్స్ అంతా ఒక ఎత్తైతే వకీల్ సాబ్ లో ఆయన చేసిన మెచ్యూర్ పెర్ఫార్మన్స్ సింప్లీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పచ్చు. కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన పవన్, సినిమాను అన్నీ తానై నడిపాడు. వన్ లైనర్ డైలాగ్స్, యాటిట్యూడ్, మేనరిజమ్స్ అన్ని బాగా ఉన్నాయి. అలాగే నివేదా థామస్, అంజలి, అనన్య వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఒక‌ర్ని మించి ఒక‌రు అద‌ర‌గొట్టారు. ఇక‌ పవన్ కళ్యాణ్ కి పోటీ ఇచ్చే లాయర్ గా ప్రకాష్ రాజ్ నటన అద్భుతం.

సాంకేతిక వర్గం: పవన్ ఇమేజ్, స్టార్డం దృష్టిలో ఉంచుకొని వకీల్ సాబ్ చిత్రానికి చాలా హంగులు అద్దారు. అలాగే అభిమాన హీరో పవన్ కళ్యాణ్ సినిమాకి మ్యూజిక్ చేయడం కోసం ఎదురుచూస్తున్న థమన్ కి వకీల్ సాబ్ వచ్చింది. థమన్ తన ప్రాణం పెట్టి పనిచేశాడు. ఈ క్ర‌మంలోనే పాటలు సూప‌ర్ హిట్ అయ్యాయి. అయితే సినిమా చూశాక‌.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా అదిరిపోయింద‌ని చెప్పాలి. ప్రతి సీన్ ని మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. నిర్మాణ విలువల విషయంలో దిల్ రాజు, బోనీ క‌పూర్ ఎక్క‌డా రాజీ పడలేదు. సినిమాకు అవసరమైందంతా సమకూర్చారు. డైరెక్ట‌ర్ పనితనం సూప‌ర్ అనిపిస్తుంది.ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా బాగుంది. ఆద్యంతం విజువల్స్ కూడా ఆకట్టుకుంటాయి.

చివరగా: వ‌కీల్ సాబ్.. ప‌వ‌న్ పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్‌కు త‌గ్గ‌ట్టే ఉంది. కేవ‌లం అభిమానుల‌నే కాకుండా.. అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా వ‌కీల్ సాబ్ ఉంది. మ‌రి లేట్ చేయ‌కుండా మీరు కూడా థియేట‌ర్‌కి వెళ్లి వ‌కీల్ సాబ్ సినిమాను ఎంజాయ్ చేసేయండి.

రేటింగ్-3.75/5