600 మంది సిబ్బందికి కరోనా.. ఎస్‌బీఐ కీల‌క నిర్ణ‌యం

క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. మొద‌టి విడ‌త కంటే రెండో విడ‌త‌లో సుడిగాలిలా జ‌నాన్ని చుట్టేస్తున్న‌ది. ప‌దుల సంఖ్య‌లో ఉద్యోగులు వైర‌స్ బారిన ప‌డుతున్నారు. కరోనా రెండో వేవ్‌లో తెలంగాణ వ్యాప్తంగా కేవ‌లం ఒక్క ఎస్‌బీఐకి చెందిన 600 మంది ఉద్యోగులు కొవిడ్ బారిన ప‌డ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా ప్రకటన విడుదల చేశారు. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులే కొవిడ్ బారీన పడుతున్నారు’’ అని ఆయ‌న వెల్ల‌డించారు. వైర‌స్ క‌ట్ట‌డిలో భాగంగా రేపటి నుంచి ఏప్రిల్‌ 30 వరకు సగం మంది ఉద్యోగులే బ్యాంకుల్లో విధులు నిర్వర్తిస్తారని ఆయన స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని‌ కోఠి , సికింద్రాబాద్‌ ఎస్బీఐ కార్యాలయాల్లో ఉద్యోగుల కోసం ప్రత్యేక కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఓపీ మిశ్రా ఈ సంద‌ర్భంగా తెలిపారు.

ఎస్‌బీఐ ఉద్యోగులే కాదు క‌రోనా జ‌ర్న‌లిస్టుల‌ను కూడా ఆగం చేస్తున్న‌ది. ఇప్ప‌టికే ప‌దుల సంఖ్య‌లో పాత్రికేయులు వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ఇటీవ‌ల‌నే సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ అమ‌ర్‌నాథ్ క‌న్నుమూయ‌గా, తాజాగా మంగ‌ళ‌వారం రోజున సాక్షి సీనియ‌ర్ స‌బ్ ఎడిట‌ర్ రామ‌చంద్ర‌రావు, మ‌రో మ‌హిళ జ‌ర్న‌లిస్ట్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ చ‌నిపోయారు. వైర‌స్ విజృంభ‌ణ‌లో పాత్రికేయులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.