ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు మ‌రో షాక్‌.. జ‌న‌సేన‌కు బ్రేక్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు వ‌రుస‌గా షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. సుదీర్ఘ విరామం త‌రువాత తాను న‌టించిన సినిమా వ‌కీల్ సాబ్ ఇటీవ‌ల విడుద‌ల‌యినా ఆశించిన‌స్థాయిలో విజ‌యాన్ని మాత్రం సొంతం చేసుకోలేదు. దాని నుంచి తేరుకోక‌ముందే పవన్ కళ్యాణ్ కరోనా వైర‌స్ బారిన ప‌డ‌డంతో ఫ్యాన్స్ మ‌రింత ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇప్పుడు సినిమాల ప‌రంగానే కాదు తాజాగా రాజ‌కీయ ప‌రంగానే ప‌వ‌న్‌కు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. పార్టీ జ‌న‌సేన ఉనికికే తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌మాదం ఏర్ప‌డింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే ఆ పార్టీ ఏకంగా త‌న గ్లాస్ గుర్త‌ను కోల్పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సినీవ‌ర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్న‌ది.

ప్రస్తుతం తెలంగాణలో ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీచేయాల‌ని భావిస్తున్న‌ది. అందుకే… తమ అభ్యర్థులకు ‘గాజుగ్లాసు’ కామన్‌ సింబల్‌గా కొనసాగించాలని ఎస్‌ఈసీని జనసేన కోరింది. కానీ.. జనసేన ఇచ్చిన వినతిపత్రంలో అంశాలు సంతృప్తికరంగా లేవని, అందుకే ఈ వినతిని ఒప్పుకోవట్లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ తెలిపారు. దీంతో ఎన్నికల పోటీలో జనసేన తన గ్లాసు గుర్తును కోల్పోయింది. గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన GHMC ఎన్నికల్లో కనీసం 10 శాతం సీట్లలో కూడా పోటీచేయని కారణంగా పార్టీ కామన్‌ గుర్తును కోల్పోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ వెల్ల‌డించారు. జనసేనతో పాటు, ఇండియన్‌ ప్రజా పార్టీ, ప్రజాబంధు పార్టీ, ఎంసీపీఐ(యూ) పార్టీ, హిందుస్థాన్‌ జనతా పార్టీలు తమ తమ గుర్తులను కోల్పోయాయి. మిగతా పార్టీల సంగ‌తి ఎలా ఉన్నా.. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారిస్తున్న పవన్‌కు ఇది‌ తీరని నష్టంగా పలువురు రాజ‌కీయ విశ్లేష‌కులు తెలుపుతున్నారు.