అంజ‌న్న‌ జ‌న్మ‌స్థ‌లంపై టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

శ్రీ‌రామ న‌వ‌మి సంద‌ర్భంగా అంజ‌న్నభ‌క్తుల‌కు శుభ‌వార్త‌. హనుమంతుడి జన్మస్థలానికి సంబంధించి టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. తిరుమలలోని అంజనాద్రిపైన ఉన్న జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని అధికారికంగా ప్ర‌క‌టించింది. దానికి సంబంధించిన ఆధారాలను జాతీయ సంస్కృత వర్సిటీ విసి ఆచార్య మురళీధరశర్మ తాజాగా వెల్ల‌డించారు. అంజనాదేవి ఆకాశగంగ తీర్థంలో 12 ఏళ్ల పాటు తపస్సు చేయగా వాయుదేవుడు ప్రత్యక్షమై ఇచ్చిన ఫలాన్ని ఆమె తిన్నదని, ఆకాశగంగా సమీపంలోనే హనుమంతుడి జన్మస్థలమని తెలిపారు. పౌరాణిక, వాజ్మయ, శాసన, చారిత్రక ఆధారాల ద్వారా హనుమంతుడి జన్మస్థలాన్ని నిర్ధారించమని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా తిరుమల గిరుల్లోని అంజనాద్రి ఆంజనేయస్వామివారి జన్మ క్షేత్రమని పురాణాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండ‌గా కొన్ని దేవాలయాల స్థల పురాణాల ఆధారంగా వేరువేరు ప్రాంతాలను హనుమంతుని జన్మ స్థలంగా కొంద‌రు ప్రచారం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే దానిపై విస్తృతంగా పరిశోధనలు జరిపి ఆధారాలతో నిరూపించాలని పలువురు పండితుల‌తో టీటీడీ క‌మిటీ వేసింది. అందులో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య మురళీధర శర్మ, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు జె.రామక్రిష్ణ, శంకరనారాయణ, ఎస్వీ వేద ఆధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి విభీషణ శర్మ త‌దిత‌రులు స‌భ్యులుగా ఉన్నారు. వారు సుమారు మూడునెల‌ల పాటు పౌరాణిక, చారిత్రక, ఆచార వ్యవహార దృష్టితో స్కంధ పురాణం, వరాహ పురాణం, పద్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్యోత్తర పురాణం, వెంకటాచల మహాత్మ్య మొదలైన పురాణాల్లో ఉన్న శ్లోకాలను పండితులు పరిశోధించారు. ఎట్ట‌కేల‌కు ఆంజనేయస్వామివారు తిరుమలలో జన్మించారని నిర్ధారించి అధికారికంగా ప్ర‌క‌టించ‌డం విశేషం.