బెంగాల్‌లో ఓవైసీ పార్టీకి ఝ‌ల‌క్‌..!

పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విజ‌యం దిశ‌గా దూసుకుపోతున్న‌ది. బీజేపీ పోటీ ఇచ్చినా మెజార్టీ సాధించ‌లేక‌పోతున్న‌ది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల‌కు గాను 292 స్థానాల‌కు ఎనిమిది విడ‌త‌ల్లో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించింది. ఈ రాష్ట్రంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 184 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 98 సీట్లలో లీడింగ్ లో ఉంది. క్షణ క్షణానికీ లెక్కలు మారుతున్నాయి. ఇక నందిగ్రామ్ నియోజకవర్గంలో మొదట మమత ఆధిక్యంలో ఉన్నట్టు కనబడినా ఆ తరువాత బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి లీడింగ్ లోఉన్నారు. ఒక ద‌శ‌లో ప‌దివేల ఓట్ల మెజార్టీ దిశ‌గా సువెందు వెళ్ల‌గా తిరిగి మ‌మ‌త పుంజుకున్నారు. ప్ర‌స్తుతం కేవ‌లం 5వేల ఓట్ల తేడాతో వెనుకంజ‌లో మమ‌త ఉండ‌గా అంద‌రి దృష్టి ఈ నియోజ‌క‌వ‌ర్గంపైనే ఉన్న‌ది.

ఇక ఇదిలా ఉండ‌గా బెంగాల్ రాష్ట్రంలో తొలిసారిగా బ‌రిలోకి ఏఐఎంఐఎం పార్టీ బ‌రిలో దిగిన విష‌యం తెలిసిందే. గ‌తంలో జ‌రిగిన మాదిరిగా ఓవైసీ నేతృత్వంలో గాలిప‌టం ఎగురుతుంద‌ని భావించినా పూర్తి నిరాశ‌నే మిగిలింది. మొత్తంగా బెంగాల్‌లో ఆ పార్టీ ఏడు స్థానాల్లో పోటీ చేయ‌గా, ఒక్క‌స్థానంలోనూ ఆధిక్యాన్ని చూప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధానంగా ముస్లింల ప్ర‌బాల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ ఏఐఎంఐఎం పార్టీ చ‌తికిల‌ప‌డ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అక్క‌డి ముస్లింలు అంద‌రూ మమత టీఎంసీకే గంప‌గుత్త‌గా ఓట్ల‌ను వేయ‌డం విశేషం. ఇక తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకె, కేరళలో లెఫ్ట్ కూటమి హవా అప్పుడే కనబడుతోంది. అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీపోటీ సాగుతోంది. .పుదుచ్చేరిలో బీజేపీ తన ట్రేండింగ్ నిరూపించుకుంటోంది.