ఏపీలో వాయిదా పడిన పది పరీక్షలు..?

పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం జూన్‌ 7 నుంచి పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. షెడ్యూల్‌ ప్రకారమే పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వం కూడా చాలా సార్లు చెబుతూ వచ్చింది. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం అవుతుందా లేదా అని చర్చించారు.

ఇప్పటికే రాష్ట్రంలో అమలులో ఉన్న కర్ఫ్యూను మరోసారి పొడిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఇబ్బంది పడతారని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విద్యార్థుల ఇబ్బందులు, ఆరోగ్యం దృష్ట్యా పరీక్షలు వాయిదా వేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. జులైలో పరీక్షల నిర్వహణపై మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు.