హ‌నీమూన్ కోసం కొడుకును అమ్మిన తండ్రి..!

May 5, 2021 at 1:12 pm

పిల్లల కోసం త‌ల్లిదండ్రులు ఎంతో త‌పిస్తారు. వారి బాగుకోసం జీవితాల‌ను సైతం త్యాగం చేస్తుంటారు. కానీ ఓ తండ్రి మాత్రం త‌న సుఖం కోసం కొడుకునే బేరానికి పెట్టాడు. రెండో భార్యతో క‌లిసి హనీమూన్‌కు వెళ్లి ఎంజాయ్‌ చేయడం కోసం రెండేళ్ల కుమారుడిని విక్ర‌యించాడు. విషయం కాస్త పోలీసులకు తెలియడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘ‌ట‌న చైనాలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. చైనాలోని జెజియాంగ్‌కు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం కాగా, వారికి ఓ పాప, రెండేళ్ల‌ వయసు ఉన్న బాబు ఉన్నాడు. దంపతుల మధ్య విబేధాలు రావడంతో వారు విడిపోయారు. ఈ క్రమంలో కూతురు బాధ్యతను తల్లికి .. కొడుకు బాధ్యతను తండ్రికి కోర్టు అప్పగించింది. ఉద్యోగం చేస్తున్న తండ్రికి కొడుకు బాధ్యతను చూడడం ఇబ్బందిగా మారింది. దాంతో బాబును తన తల్లిదండ్రుల దగ్గర వదిలి వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత అతడు మరో యువతిని రెండో వివాహం చేసుకోగా, బిడ్డను తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దీనికి రెండో భార్య అంగీకరించలేదు.

ఇదిలా ఉండ‌గా.. ఇక బిడ్డ ఎప్పటికైనా తనకు అడ్డంకే అని భావించిన ఆ వ్యక్తి ఓ భయంకరమైన ప్లాన్‌ వేశాడు. బిడ్డను అమ్ముదామని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి.. కొడుకును తీసుకువచ్చాడు. ఏ మాత్రం దయ లేకుండా ఆ చిన్నారిని 1,58,000 యువాన్లు(సుమారు 18 లక్షల రూపాయలు)కు అమ్మేశాడు. వచ్చిన మొత్తం తీసుకుని కొత్త భార్యతో హనీమూన్‌కు వెళ్లాడు. జాలీగా ఎంజాయ్‌ చేయసాగాడు. మ‌న‌వ‌డితో మాట్లాడుదామ‌ని అత‌ని నాన‌మ్మ‌, తాత త‌మ కుమారుడికి కాల్ చేయ‌గా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో అనుమానం వ‌చ్చిన వారు పోలీసులను ఆశ్ర‌యించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. అస‌లు విష‌యం తెలిసి నివ్వెర పోయారు. దంపతులు హ‌నీమూన్ నుంచి వచ్చే వరకు ఎదురు చూసిన పోలీసులు ఆ తర్వాత వారిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.

హ‌నీమూన్ కోసం కొడుకును అమ్మిన తండ్రి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts