క‌రోనా సాకుతో పెళ్లికి నిరాక‌ర‌ణ‌..! తీరా క‌ట్ చేస్తే..

ఇప్పుడు దేనికైనా క‌రోనా మ‌హ‌మ్మారిని అడ్డుగా పెట్టుకోవ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. తాజాగా వెలుగుచూసిన సంఘ‌ట‌న అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది. మ‌రికొద్ది క్ష‌ణాల్లో జ‌ర‌గాల్సిన పెళ్లి ఆగ‌డ‌మే కాకుండా అది ఠాణాకు చేరుకుంది. తీరా అధికారులు విచారించ‌గా ఒక్కో విష‌యం బ‌య‌ట‌ప‌డుతున్న‌ది. వివ‌రాల్లోకి వెళ్లితే.. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఓ అబ్బాయి ముదిగుబ్బ కు చెందిన ఓ అమ్మాయితో వివాహం జరిపించేందుకు పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. అనుకున్న ప్ర‌కారం వ‌ధూవ‌రులు కదిరికి చేరుకోగా పెళ్లి తంతు కొన‌సాగిస్తున్నారు పెద్ద‌లు. అంత‌లోనే వ‌ధువు అంద‌రికీ షాక్ ఇచ్చింది. తనకు ఇష్టం లేదంటూ మొండికేసింది. ఇదేమ‌ని పెద్ద‌లు నిల‌దీయ‌గా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని బాంబు పేల్చింది. అప్ప‌టికీ వ‌రుడు బంధువులు వ‌ధువుకు న‌చ్చ‌జెప్పేందుకు ప్ర‌య‌త్నించినా ఆమె పెళ్లికి స‌సేమిరా అన్న‌ది. దీంతో ఇరువ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, తీరా ఆ పంచాయితీ ఠాణాకు మెట్లెక్కింది.

పోలీసులు చేప‌ట్టిన మ‌రిన్ని విష‌యాలు వెలుగు చూడ‌డంతో పెళ్లికి వ‌చ్చిన‌వారు అవాక్క‌య్యారు. త‌న‌కు మొదటి నుంచీ ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతున్నా బలవంతంగా చేసేందుకు య‌త్నిస్తున్నార‌ని వ‌ధువు మ‌రో షాక్ ఇవ్వ‌గా, తన బిడ్డను, తనను భయపెట్టి ఈ పెళ్లి చేయాలని చూస్తున్నారని, చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పెళ్లికూతురు తల్లి బోరుమంది. మరోవైపు తల్లి ఇష్ట ప్రకారమే అన్నింటికి వ‌ధువు ఒప్పుకుంద‌ని, అదీగాక ఇప్పటికే తమవద్ద నుంచి రూ.3 లక్షల విలువైన‌ బంగారం, నగదును వ‌ధువు అమ్మ తీసుకుంద‌ని, తీరా పెళ్లిపీటలకు వరకు వచ్చేసరికి అడ్డం తిరగారని సంబంధం కుదిర్చిన పెళ్లి పెద్ద, పెళ్ళికొడుకు ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. ఇరువ‌ర్గాల వాద‌న‌ల‌ను విన్న అనంత‌రం ఇదేవిష‌య‌మై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కదిరి టౌన్ ఎస్సై మహ్మద్ రఫీ చెప్పడంతో ఇరువురు త‌మ స్వ‌గ్రామాల‌కు వెళ్లిపోయారు. ఇది మ‌రెన్ని మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.