క‌రోనా నేప‌థ్యంలో కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం..!

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పని వత్తిడి తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్య్తాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్దంగా వున్న అర్హులైన వైద్యులనుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని సిఎం కెసిఆర్ వైద్యాధికారులను ఆదేశించారు. వారికి గౌరవ ప్రదమైన రీతిలో జీతాలు అందించాలని అన్నారు. అంతేకాకుండా.. వారు కరోనా వంటి కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వారి సేవలకు సరియైన గుర్తింపునివ్వాలన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వారికి వెయిటేజీ మార్కులను కలపాలని సిఎం ఆదేశించారు. కష్టకాలంలో ప్రజలకోసం సేవచేయడానికి ముందుకు రావాలని యువ డాక్టర్లకు సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి ఆసక్తి వున్నవాల్లు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సిఎం తెలిపారు. డాక్టర్లతో పాటు రాష్ట్రంలో అర్హతవున్న నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ముందుకు రావాలని సిఎం పిలుపునిచ్చారు.

ఇక వరంగల్లు అదిలాబాద్ ల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లను తక్షణమే ప్రారంభించాలని, 729 మంది వైద్య సిబ్బంది నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎం జి ఎం కు చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను, అదిలాబాద్ జిల్లా రిమ్స్’ లోని మరో 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను తక్షణమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పిఎంఎస్ఎస్ వై కింద ఎంజిఎం లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి ప్రభుత్వ వాటాకింద తక్షణం అందచేయాల్సిన 8 కోట్ల రూపాయలను, రిమ్స్ లో ఇదే పథకం కింద నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానకు ప్రభుత్వ వాటాకింద 20 కోట్ల రూపాయలను, మొత్తం 28 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. వరంగల్ దవాఖానాకు 363 వైద్య సిబ్బందిని, అదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ కోసం 366 మంది వైద్యసిబ్బందిని, మెత్తం 729 సిబ్బంది నియామకానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను సిఎం ఆదేశించారు.