క‌రోనాతో భార్య‌.. బ్లేడ్‌తో కోసి హ‌త‌మార్చిన భ‌ర్త‌

May 8, 2021 at 8:59 am

క‌రోనా సృష్టిస్తున్న విల‌యం అంతా ఇంతా కాదు. ఒక‌వైపు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌కుండా ప్రాణాల‌ను తీస్తుండ‌గా, మ‌రోవైపు మ‌రెన్నో దారుణ సంఘ‌ట‌నల‌కు కార‌ణ‌మ‌వుతున్న‌ది. కుటుంబ బంధాల‌ను చిద్రం చేస్తున్న‌ది. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. క‌రోనా బారిన ప‌డిన భార్య‌ను ఆమె భ‌ర్త దారుణంగా హ‌త్య చేశాడు. ఈ విషాద‌క‌ర సంఘ‌ట‌న నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. అధికారులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. నెల్లూరు జిల్లా కావలి పట్టణం సంక్లవారి తోట పరిధిలోని గోరింకపాలెం వీధికి చెందిన మల్యాద్రి, అనురాధ(30) దంపతులు 13 రోజుల క్రితం కరోనా వైర‌స్ బారిన ప‌డ్డారు. దీంతో పిల్లల‌ను చుట్టాల ఇంటికి పంపి వారిద్ద‌రే ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉంటూ వైద్యులు సూచించిన మందుల‌ను వాడుతున్నారు.

ఇదిలా ఉండ‌గా శుక్ర‌వారం రాత్రి అనురాధకు ఒక్క‌సారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో ఆందోళ‌న‌కు గురైన మ‌ల్యాద్రి వెంట‌నే 108, 104 వాహనాలకు సమాచారం అందించారు. స్థానిక అధికారులకు స‌మాచారం ఇచ్చాడు. అయిన‌ప్ప‌టికీ ఎవ‌రూ రాక‌పోవ‌డంతో మ‌న‌స్థాపానికి గురైన దంపతులు చనిపోవాల‌నుకున్నారు. అప్ప‌టికే మ‌ద్యం మ‌త్తులో ఉన్న మల్యాద్రి తొలుత త‌న భార్య అనురాధ చేతిని బ్లేడ్‌తో విచక్షణారహితంగా కోశాడు. అనంతరం తాను కూడా ఎడమ చేతి మణికట్టుపై కొంత మేర కోసుకొని అలాగే నేరుగా వ‌న్ టౌన్ పోలీస్ స్టేష‌న్ కు వెళ్లాడు. అధికారుల‌కు విష‌యం చెప్ప‌గా, వారు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్ల‌గా అప్పటికే అనురాధ క‌న్నుమూసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

క‌రోనాతో భార్య‌.. బ్లేడ్‌తో కోసి హ‌త‌మార్చిన భ‌ర్త‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts