ముందంజలో దీదీ

ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే బెంగాల్ ఫలితాలు ఉండబోతున్నట్టు ఓట్ల లెక్కింపు సరళిని బట్టి అర్థమవుతోంది. మొత్తం 292 స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో బీజేపీ, తృణమూల్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఇప్పటివరకు 134 స్థానాలకు సంబంధించిన కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతుండగా.. అందులో టీఎంసీ 70 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఇక టీఎంసీతో అమీతుమీ అన్నట్టుగా పోటీ పడుతున్న బీజేపీ 63 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. లెఫ్ట్ పార్టీలు 2, ఇతరులు ఒక్క స్థానంలో ముందంజలో ఉన్నారు. ఇక మమత బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లోనూ పరిస్థితి హోరాహోరీగానే ఉంది.

ఇక్కడ మమతపై పోటీ చేస్తున్న బీజేపీ నేత సువేందు అధికారి పలు రౌండ్లలో ఆమెపై ఆధిక్యత కనబర్చడం తృణమూల్ శ్రేణులను టెన్షన్ పెడుతోంది. ఓ వైపు రాష్ట్రంలో ఫలితాలు హోరాహోరీగా ఉండగా మరోవైపు నందిగ్రామ్‌లోనూ మమతకు బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో తుది ఫలితాలు ఏ రకంగా ఉంటాయో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 6వ రౌండ్ ముగిసే స‌రికి ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ ఆధిక్యంలోకి వ‌చ్చారు. తొలి రౌండ్ నుంచి ఐదు రౌండ్లు ముగిసే వ‌ర‌కు వెన‌క‌ప‌డి ఉన్న మ‌మ‌త ఆరో రౌండ్‌కు ఆధిక్యంలోకి వ‌చ్చారు. 5వ రౌండ్ వ‌ర‌కు 7 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్న సువేందు అధికారి 6వ రౌండ్‌కు వ‌చ్చే స‌రికి ఏకంగా వెన‌క‌ప‌డిపోగా మ‌మ‌త 1427 ఓట్ల ఆధిక్యంలోకి వ‌చ్చాశారు.