ఆ మాజీ మంత్రి మ‌ళ్లీ టీడీపీలోకి రివ‌ర్స్ జంప్ ?

రాజ‌కీయాలు ఎలాగైనా మారిపోవ‌చ్చు. ఏపార్టీకి ఎవ‌రూ శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌ని అంటారు. పార్టీ మారేవారు.. ఎప్పుడు ఎటు అవ‌కాశం ఉంటే.. అటు మారిపోతూ ఉంటారు. పార్టీలు కూడా త‌మ‌కు అనుకూలంగా ఉండే నేత‌ల‌కు ప‌ట్టం క‌ట్టేందుకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. సో.. నాయ‌కులు కూడా ఎప్పుడైనా పార్టీ మారిపోవ‌చ్చ‌నే ధీమాలో ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇలానే చేసేందుకు ప్ర‌కాశం జిల్లా చీరాల‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పాలేటి రామారావు ప్ర‌య‌త్నిస్తున్నా ర‌ని అంటున్నారు ప్ర‌కాశం రాజ‌కీయ విశ్లేష‌కులు.

టీడీపీలో రాజ‌కీయాలు ప్రారంభించిన పాలేటి రామారావు.. చీరాల నుంచి రెండుసార్లు విజ‌యం అందుకున్నారు. 1994, 1999ల‌లో వ‌రుస‌గా ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌విని కూడా అప్ప‌గించారు. అయితే.. 2004లో ఓట‌మి త‌ర్వాత‌.. పాలేటి.. పార్టీ మారిపోయారు. 2007లో చిరంజీవి పెట్టిన ప్ర‌జారాజ్యం పార్టీలోకి చేరిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌ఫున పోటీ చేశారు. అయితే.. మూడో స్థానానికి ఆయ‌న ప‌డిపోయారు. దీంతో కొన్నాళ్లు మౌనంగా ఉన్న పాలేటి.. త‌ర్వాత‌.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇక ప్ర‌జారాజ్యం నుంచి ఆయ‌న వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. వైసీపీ ఇంచార్జ్‌గా కూడా చ‌క్రం తిప్పారు. అయితే.. 2014 ఎన్నిక‌ల్లో త‌న‌ను కాద‌ని.. ఎడం బాలాజీకి వైసీపీ చీరాల టికెట్ ఇవ్వ‌డంతో అలిగిన ఆయ‌న తిరిగి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో గ‌త ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ టికెట్ ఆశించినా ప్ర‌యోజ‌నం ల‌భించ‌లేదు. అయినా.. పార్టీలోనే ఉన్నారు. క‌ర‌ణం బ‌ల రాం గెలుపుకోసం కృషి చేశారు. కానీ.. ఇటీవ‌ల కాలంలో క‌ర‌ణంకు, పాలేటికి మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయ‌ని టాక్ ? దీంతో ఆయ‌న ఇప్పుడు మ‌ళ్లీ తిరిగి త‌న మాతృ పార్టీకి వెళ్లిపోవాల‌ని చూస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం చీరాల‌లో పార్టీ ప‌రిస్థితి ఇబ్బందిగానే ఉంది. ఇక్క‌డ పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న ఎడం బాలాజీ దూకుడుగా లేక‌పోవ‌డంతో.. పార్టీ పుంజుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో ఇక్క‌డ కీల‌క నేత కోసం పార్టీ ఎదురు చూస్తోంది. ఈ క్ర‌మంలో ఈ గ్యాప్‌ను దృష్టిలో పెట్టుకున్న పాలేటి.. టీడీపీలోకి జంప్ చేస్తే.. ఇంచార్జ్ పోస్టు త‌న‌కు వ‌స్తుంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుదిరితే.. టికెట్ కూడా సంపాయించుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. మ‌రి దీనికి టీడీపీ అధిష్టానం ఓకే చెబుతుందా? లేదా? అనేది ఆస‌క్తిగా మారింది.