ఈట‌ల భూక‌బ్జాలో కొత్త ట్విస్ట్‌.. హైకోర్టుకు రైతులు!

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఉదంతంలో వెలుగులోకి వ‌చ్చి మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజల్‌ గ్రామ భూముల వివాదంలోకొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ కొంద‌రు రైతులు హైకోర్టును ఆశ్ర‌యించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భూముల స‌ర్వేను అడ్డుకోవాల‌ని వారు డిమాండ్ చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. మాజీమంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై భూక‌బ్జాతో వెలుగులోకి వ‌చ్చిన అనంత‌రం ప్ర‌భుత్వం దేవ‌ర‌యాంజ‌ల్ భూముల‌పై దృష్టి సారించింది. న‌లుగురు ఐఏఎస్‌ల‌తో ప్ర‌త్యేక క‌మిటీ వేసి విచార‌ణ జ‌రిపిస్తున్న‌ది, ఆల‌య భూమిని పూర్తిగా స‌ర్వే చేయించాల‌ని నిర్ణ‌యించింది. అందుకోసం ఈ నెల 3న ప్రభుత్వం ప్ర‌త్యేకంగా జీవో 1014 జారీ చేసింది. ఇదిలా ఉండ‌గా దీనిపై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఏకంగా హైకోర్టును వారు ఆశ్ర‌యించిండం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

భూ సర్వేని నిలుపుద‌ల చేయాల‌ని కోరుతూ సదా సత్యనారాయణరెడ్డి సహా ఐదురుగు రైతులు శుక్రవారం హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్ర‌భుత్వ జీవోను స‌వాల్ చేశారు. అద‌త‌గాక త‌మ భూములను స్వాధీనం కోసమే సర్వే అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. తమ భూముల్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు 2005లో జరిగాయని, దానిపై తాము న్యాయపోరాటం చేస్తే 2010 ఆగస్టు 26న తమకు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. భూములు ఆలయానికి చెందినవి కావని, తమను భూముల నుంచి ఖాళీ చేయించరాదని ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎలాగైనా భూముల్ని కాజేయాలనే ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారులతో ఒక కమిటీని ఈ నెల 3న నియమించిందన్నారు. ఎండోమెంట్స్‌ ట్రైబ్యునల్‌ ఎదుట తమ అభ్యంతరాలు చెబితే పట్టించుకోకుండా ఉత్తర్వులు జారీ చేస్తే వాటిని 2019 నవంబర్‌28న హైకోర్టులో సవాల్‌ చేశామని చెప్పారు. భూములపై హక్కులు నిరూపించుకునే వరకూ భూముల నుంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. సర్వే కోసం ఐఏఎస్‌ అధికారుల కమిటీని రద్దు చేయాలని, సర్వే పేరుతో అధికారులు తమ భూముల్లోకి రాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఇందులో సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, దేవరయాంజల్‌లోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ స్పెషల్‌ ఆఫీసర్లను ప్రతివాదులుగా చేర్చ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఈ పిటిష‌న్ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.