తిరుమలకు వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్..?

టీటీడీ అధికారులు కీలక ప్రకటన చేశారు. జూన్ 1వ తేదీ నుంచి జూలై 31 వ తేదీ వరకు రెండు నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం మూసివేస్తున్నట్టు తెలిపారు. తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు ఇక 2 నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం అందుబాటులో ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.

కాలినడకన తిరుమలకు వెళ్లాలనుకునే వారు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని, ఇందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు భక్తులను ఉచిత బస్సుల ద్వారా తరలిస్తామని, అందుకోసం ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ తెలిపింది. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని, అందరూ టీటీడీకి సహకరించాలని కోరింది. ఇక అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద నేటి నుంచి ఫాస్టాగ్‌ అమల్లోకి రానుంది. అంతేకాకుండా పెంచిన కొత్త టోల్‌ చార్జీలను కూడా అమలు చేయనున్నారు. గతంలో బైక్ లకు రూ.2 చార్జీ వసూలు చేయగా.. ఇకపై ఉచితంగానే వాటిని అనుమతిస్తారు. 4 చక్రాల వాహనాలకు గతంలో రూ.15 చార్జీ ఉండగా ఇకపై రూ.50 వసూలు చేయనున్నారు.