హ‌నుమంతుడు మ‌న దేశంలో పుట్టినందుకు గ‌ర్వించండిః బ్ర‌హ్మానందం

ఇటీవల హనుమంతుడి జన్మస్థలం గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ప్రకటన చర్చకు దారితీసింది. ఏడు కొండల్లోని అంజనాద్రి ఆంజనేయుడి జన్మస్థలమని టీటీడీ ప్రకటించింది. దీనిపై కర్ణాటకలోని కిష్కింధ ట్రస్ట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హనుమంతుడి జన్మస్థలం కిష్కింధ అని వాదించింది. ఇరు పక్షాల మధ్య ఇటీవలే తిరుపతిలో చర్చ జరిగినప్పటికీ రెండు వర్గాలు తుది నిర్ణయానికి రాలేకపోయాయి. ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉండటంతో ఫలితం తేలకుండానే చర్చలు ముగిశాయి. హనుమంతుడి గురించి ఇలాంటి వివాదం చెలరేగడం పట్ల హిందూ భక్తులు ఎంతో బాధపడుతున్నారు.

మరోవైపు, ఈ అంశంపై ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం ఓ టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో పాల్గొంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భక్తికి నిదర్శనం హనుమంతుడని ఆయన అన్నారు. ఆయన ఎక్కడ పుట్టారనే విషయాన్ని వివాదాస్పదం చేయరాదని కోరారు. ఇలాంటి వివాదం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. హనుమంతుడు ఎక్కడ పుట్టారనే విషయంపై వాదనలు చేసుకోవడం సరికాదని ఆయన మన దేశంలో పుట్టారని గర్వపడితే బాగుంటుందని చెప్పారు. ఆంజనేయుడు అందరివాడని ఆయన అంశాన్ని వివాదాస్పదం చేయరాదని సూచించారు.