పుష్ప‌కు త‌రుణ్ డ‌బ్బింగ్‌..ట్విస్ట్ ఇచ్చిన సుక్కు!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప‌. క్రియేట్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. ఫహాద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు.

పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఫహాద్ ఫాజిల్ హీరోగా తెర‌కెక్కిన అనుకోని అతిథి సినిమా ఆహా లో స్ట్రీమ్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అతని పాత్రకి హీరో తరుణ్ తో డబ్బింగ్ చెప్పించారు. దీంతో పుష్ప‌లో కూడా ఫహాద్ పాత్ర‌కు త‌రుణ్‌నే డ‌బ్బింగ్ చెబుతాడ‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఈ విష‌యంలో సుకుమార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుని ట్విస్ట్ ఇచ్చారు. సాధ్యమైనంతవరకూ ఫహాద్ ఫాజిల్ తోనే డబ్బింగ్ చెప్పించాలనే ఉద్దేశంతో సుక్కూ ఉన్నాడట. ఈ క్రమంలోనే ఫహాద్ ఫాజిల్ కి చిత్తూరు యాస నేర్పించడానికి తగిన ఏర్పాట్లు చేశాడట. ఫహాద్ ఫాజిల్ కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి భాషపై గట్టిగానే ట్రై చేస్తున్నాడని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.