పవన్ పార్టీ జెండా పీకేస్తాడా..?

May 21, 2019 at 10:46 am

రాష్ట్రంలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌స్తున్నఅంశం జ‌న‌సేన‌. రాజ‌కీయాల్లో స‌మూల మార్పులు మార్పులు తీసుకువ‌స్తాన‌ని, కుళ్లిపోయిన వ్య‌వ‌స్థ‌ల‌ను బాగు చేస్తాన‌ని భీక‌ర ప్ర‌తిజ్ఞ‌ల‌తో రాజ‌కీయ అరంగేట్రం చేసిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ 2014కు ముందు స్థాపించిన పార్టీ జ‌న‌సేన. ఆయ‌న అరంగేట్ర‌మే అనేక సందేహాల‌తో ముడిప‌డింది. గ‌తంలో 2007లో ఆయ‌న అన్న‌, చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం ప‌ట్టుమ‌ని ఐదేళ్లు కూడా గ‌డ‌వ‌క‌ముందే పుట్టిముంచుకుని పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డంతో అంద‌రూ కూడా ప‌వ‌న్ నిల‌బ‌డ‌తాడా? త‌డ‌బ‌డ‌తాడా? అనే సందేహాల‌ను వ్య‌క్తం చేశారు. అయితే, జ‌న‌సేనాని ఈ వ్యాఖ్య‌ల‌కు త‌ర‌చుగా స‌మాధానం ఇస్తూనే వ‌చ్చారు. తాను ఓట్లు, సీట్ల కోసం రాజ‌కీయాల్లోకి రాలేద‌ని, మార్పు కోసం వ‌చ్చాన‌ని ప్ర‌క‌టిస్తూవ‌చ్చారు.

అయితే, అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశంలో రాజ‌కీయ పార్టీల మ‌నుగ‌డ చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్రాతినిధ్యం ఉన్నంత వ‌ర‌కే అనేది కీల‌క విష‌యం. ఎక్క‌డా కూడా చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్రాతినిధ్యం లేకుండా మ‌న‌గ‌లిగిన పార్టీ ఈ దేశంలో మ‌న‌కు క‌నిపించ‌దు. ఎన్ని ఎక్కువ సీట్లు, ఎన్ని ఎక్కువ ఓట్ల‌ను రాబ‌ట్టుకోగ‌లిగిన పార్టీకే ప్ర‌జ‌ల్లో టాక్ ఉంటుంది. ఈ చిన్న విష‌యాన్ని ప‌వ‌న్ ప‌క్క‌న పెట్టి.. రాజ‌కీయ విన్యాసం చేయ‌డం ఇప్పుడు పార్టీ మ‌నుగ‌డ‌పైనే ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ నుంచి ప‌క్క‌కు త‌ప్పుకొన్నాకూడా.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం ప‌వ‌న్ పోటీ చేశారు. అంతేకాదు, బీఎస్పీ, క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి కూట‌మిగా పోరు చేశారు.

ఆస‌క్తిక‌రంగా జ‌రిగిన ప‌వ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం, పోటీ కూడా జ‌న‌సేన‌ను నిల‌బెడ‌తాయ‌ని అనుకున్నారు చాలా మందే ఉన్నారు. కానీ, తాజాగా వ‌చ్చిన ఎగ్జిట్ పోల్ స‌ర్వేల‌లో జ‌న‌సేన ప్ర‌స్థావ‌న ఎక్క‌డా మ‌న‌కు పెద్ద‌గా క‌నిపించ‌లేదు. తెలుగు వాడు, సినీ ఇండ‌స్ట్రీతో సంబంధాలు ఉన్న వాడు అయిన ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ చేసిన స‌ర్వేలోనే జ‌న‌సేన‌కు పెద్ద‌గా మార్కులు రాలేదు. ఒక సీటును మాత్ర‌మే ఆయ‌న‌కు ప‌రిమితం చేశారు. దీంతో ఇప్పుడు జ‌న‌సేన‌పై ఆశ‌లు పెట్టుకున్న‌వారిలో క్లారిటీ వ‌చ్చేసింది. దీనిని బ‌ట్టి జ‌న‌సేన కేవ‌లం ఒక‌టి లేదా రెండు సీట్ల‌లోనే విజ‌యం సాధించ‌నుంద‌ని తేలిపోయింది.

మ‌రి ఈ నేప‌థ్యంలో రాబోయే ఐదేళ్ల త‌ర్వాత జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల నాటికి ఈ పార్టీ అస‌లు ఉంటుందా? ఉండ‌దా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. పార్టీ అంటే కేవ‌లం నాయ‌కులు మాత్ర‌మే కాదు. బ‌ల‌మైన కేడ‌ర్‌, బ‌ల‌మైన అనుచ‌రులు కూడా ఉండాలి. కానీ, జ‌న‌సేన విష‌యంలో వ‌చ్చే ఐదేళ్ల‌పాటు వీరు పార్టీతోనే ఉంటారా? అనేది సందేహం. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షంలో ఉన్న జ‌గ‌న్‌ను తీసుకుంటే.. 67మందిని గెలిపించుకుని కూడా ఆయ‌న 25 మంది ఎమ్మెల్యేల‌ను కాపాడుకోలేక పోయారు. ఇదే ప‌రిస్థితి జ‌న‌సేన‌కు కూడా సంభ‌వించే అవ‌కాశం ఉంది. మ‌రోప‌క్క‌, ఆర్థికంగా త‌న‌కు సినిమాలే ప్ర‌ధాన‌మ‌ని ప‌దే ప‌దే చెప్పిన ప‌వ‌న్‌.. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక త‌న సినిమాలు తాను చేసుకుంటే.. పార్టీని న‌డిపించేది ఎవ‌రు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఈ నేప‌థ్యంలో ఐదేళ్ల‌నాటికి అస‌లు పార్టీనే ఉండ‌ద‌నే విశ్లేష‌ణ‌లు ఊపందుకున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

పవన్ పార్టీ జెండా పీకేస్తాడా..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share