తెలుగు సినిమాల్లో చెక్కు చెద‌ర‌ని చ‌రిత్ర ‘ విజ‌య‌నిర్మ‌ల‌ ‘

June 27, 2019 at 10:19 am

టాలీవుడ్‌లో ఎన్నో చెక్కు చెద‌ర‌ని రికార్డులు…. ఎప్ప‌ట‌కీ తిరుగులేని చ‌రిత్ర సొంతం చేసుకున్న ప్ర‌ముఖ న‌టి, ద‌ర్శ‌కురాలు, సూప‌ర్‌స్టార్ కృష్ణ స‌తీమ‌ణి విజ‌య‌నిర్మ‌ల (73) మృతిచెందారు. బుధ‌వారం అర్ధ‌రాత్రి దాటాక ఆమె తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు. కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె గ‌చ్చిబౌలిలోని కాంటినెంట‌ల్ హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు.

11 ఏళ్ల‌కే వెండితెరంగ్రేటం…..
విజ‌య‌నిర్మ‌ల తండ్రి త‌మిళ‌నాడుకు చెందిన వారు. ఆమె త‌ల్లి స్వ‌స్థ‌లం గుంటూరు జిల్లా న‌ర‌సారావుపేట‌. విజ‌య‌నిర్మ‌ల తమిళనాడు రాజ‌ధాని మ‌ద్రాస్‌లో 1946 ఫిబ్రవరి 20న జన్మించారు. త‌మిళ‌నాడులో స్థిర‌ప‌డిన తెలుగు కుటుంబానికి చెందిన ఆమె కేవ‌లం ఏడేళ్ల ప్రాయంలోనే బాల‌నటిగా మ‌త్స‌రేఖ (త‌మిళ్ సినిమా)తో సినిమా తెర‌పై క‌నిపించారు. ఇక 11 ఏళ్ల వ‌య‌స్సులో పాండురంగ‌మ‌హ‌త్యం సినిమాతో ఆమె తెలుగు తెర‌పై తొలిసారిగా క‌నిపించారు.

హీరోయిన్‌గా రంగుల‌రాట్నంతో….
ఏడేళ్ల‌కే త‌మిళ్‌లో… 11 ఏళ్ల‌కే తెలుగులో తెర‌పై క‌నిపించిన ఆమె హీరోయిన్‌గా రంగుల‌రాట్నం సినిమాతో తొలిసారిగా న‌టించారు. అప్ప‌టి నుంచి ప్రారంభ‌మైన ఆమె వెండితెర ప్ర‌స్థానం బ్రేక్ లేకుండా కంటిన్యూగా సాగింది. తెలుగు, త‌మిళ్‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో సుమారు 200కు పైగా చిత్రాల్లో న‌టించారు. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు, మ‌ర‌పురాని పాత్ర‌లు ఆమె సొంతం.

బుల్లితెర‌పై కూడా…
వెండితెర మ‌హారాణిగా ఓ వెలుగు వెలుగొందిన విజ‌య‌నిర్మ‌ల బుల్లితెర‌పై కూడా పెళ్లికాన‌క సీరియ‌ల్ ద్వారా ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు.

విజ‌య‌నిర్మ‌ల అస‌లు పేరు ఇదే…
ఇక టాలీవుడ్ స‌హ‌జ‌న‌టి జయసుధకు విజయనిర్మల పిన్ని. ఆసక్తికరమైన మరో విషయం ఏమంటే.. ఆమె అసలు పేరు నిర్మల. అయితే.. తనకు తొలి అవకాశం ఇచ్చిన విజయ సంస్థ వారి గుర్తుగా ఆమె తన పేరును విజయనిర్మలగా మార్చుకున్నారు. అప్ప‌టి నుంచి ఆమె పేరు విజ‌య‌నిర్మ‌ల‌గా స్థిర‌ప‌డిపోయింది.

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌తో వివాహం…
విజ‌య‌నిర్మ‌ల వ్య‌క్తిగ‌త జీవిత విష‌యానికి వ‌స్తే ఆమె ముందుగా కృష్ణ‌మూర్తిని వివాహం చేసుకున్నారు. వీరి సంతానం న‌రేష్‌. ఆ త‌ర్వాత విబేధాలు రావ‌డంతో కృష్ణ‌ను ఆమె రెండో వివాహం చేసుకున్నారు. అప్ప‌టికే కృష్ణ‌కు వివాహ‌మై పిల్ల‌లు కూడా ఉన్నారు. ప్ర‌ముఖ దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సాక్షి’ చిత్రంతో తొలిసారి జోడీ కట్టిన వీరిద్దరూ నిజ జీవితంలోనూ జోడీగా మారారు. రంగులరాట్నం చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విజయనిర్మల మరుసటి ఏడాదే ‘సాక్షి’ చిత్రంలో కృష్ణతో జోడీ కట్టారు. ఇక్కడే వీరి ప్రేమకు బీజం పడటం.. అది వివాహ బంధంగా బలపడటం మారింది.

ద‌ర్శ‌కురాలిగా గిన్నీస్ రికార్డ్ :
ఇక ప్ర‌పంచ సినిమా చ‌రిత్ర‌లోనే ఎవ్వ‌రికి లేని రికార్డు విజ‌య‌నిర్మ‌ల‌కు సొంతం. నటిగా ఎన్నో హిట్లు కొట్టిన ఆమె ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా ఆమె పేరు నమోదైంది. 44 చిత్రాలకు ఆమె దర్శకత్వం చేశారు. 1971లో మీనాతో ద‌ర్శ‌కురాలిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె 2009 వరకు మొత్తం 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆమె దర్శకురాలిగా వ్యవహరించారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన నేరము-శిక్ష (2009) చిత్రం దర్శకురాలిగా ఆమె చివరి చిత్రం.

తెలుగు సినిమాల్లో చెక్కు చెద‌ర‌ని చ‌రిత్ర ‘ విజ‌య‌నిర్మ‌ల‌ ‘
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share