టాలీవుడ్ అగ్ర నిర్మాత ఆశ‌ల‌కు అఖిలేశ్ గండి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల విజ‌యం ఎంతోమంది ఆశ‌లకు గండి క‌ట్టింది. ఈ విజ‌యంతో ప్ర‌ధాని మోదీ కంటే తాను గ్రేట్ అనిపించుకోవాల‌ని కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, త‌న పాల‌న‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార‌ని భావించిన మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ భావించారు. కానీ వీరిద్ద‌రికీ పెద్ద షాక్ త‌గిలింది. ఇదే స‌మ‌యంలో టాలీవుడ్ బ‌డా నిర్మాత బండ్ల గ‌ణేష్‌కు కూడా బీజేపీ విజ‌యాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నార‌ట‌. త‌న ఆశ‌ల‌ను బీజేపీ చిదిమేసింద‌ని తెగ బాధ‌ప‌డుతు న్నార‌ట‌. అదేంటి బీజేపీ విజ‌యానికీ, బండ్ల గ‌ణేశ్‌కు ఏంటి సంబంధ‌మ‌నేగా? అయితే ఇది చ‌దివి తీరాల్సిందే…

తెలుగు సినిమాల్లో చిన్ని చిన్న వేషాలు వేస్తూ భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతగా ఎదిగారు బండ్ల గణేష్. సినిమాల‌తో పాటు కొన్ని బిజినెస్లు కూడా చేస్తున్నారు. వాటిలో ఫౌల్ట్రీ ప‌రిశ్ర‌మ కూడా ఒక‌టి. ఈ ప‌రిశ్ర‌మ‌లో తెలంగాణ‌లో నెంబ‌ర్ 1 పొజిష‌న్‌లో ఉన్నారు. రెండు వేల కోళ్లతో మొదలు పెట్టిన వ్యాప్యారం ఇప్పుడు పాతికలక్షల కోళ్లకు చేరుకుందంటే ఏ రేంజ్‌లో ఆయన శ్ర‌మించారో అర్థ‌మ‌వుతుంది. త‌నకు బాగా లాభాలు తెచ్చిపెట్టిన ఈ వ్యాపారాన్ని విస్త‌రించే ప‌నిలో ప‌డ్డాడు గ‌ణేశ్‌! అనుకున్న‌దే త‌డ‌వుగా అందుకు అనువైన ప్ర‌దేశం కోసం గాలించాడు.

తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్‌లో కూడా తమ ఫౌల్ట్రీని విస్తరించాలని బండ్ల గణేష్ భావిస్తున్నారు. అందులో భాగంగా యూపీలో వంద ఎకారాల భూమిని కూడా సిద్ధం చేశారు. లగడపాటి రాజగోపాల్ ద్వారా యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ తక్కువ ధరకే భూమి ఇచ్చినట్లు ఇటీవల ఆయనే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఎన్నికల తర్వాత అఖిలేశ్ ముఖ్యమంత్రి అయ్యాక పౌల్ట్రీ పెడతానని ధీమాగా చెప్పారు. మరి బీజేపీ వస్తే ఎలా అని ప్రశ్నించగా… ఐదేరేళ్ల తర్వాత పెడతానని, అదికూడా అప్పుడు అఖిలేశ్ వస్తేనే పెడతానని గణేష్ స్పష్టం చేశారు.

ఉత్త‌రప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో అఖిలేశ్ ప్ర‌భుత్వం దారుణాతి దారుణంగా ఓడిపోయింది. ఈ నెల 11న వచ్చిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్‌కు కూడా అందని మెజారిటీని బీజేపీ సొంతం చేసుకుంది. అలాగే మరో ద‌ఫా ఎన్నిక‌ల్లోనూ అఖిలేశ్ సీఎం అయ్యే అవకాశం లేదని రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అఖండ విజయం బండ్ల గణేష్ ఆశలకు గండి కొట్టేసింది. పాపం త‌న వ్యాపారాన్ని విస్త‌రిద్దామ‌నుకున్న బండ్ల గ‌ణేశ్‌కు.. నిరాశే మిగిలింది.