బాహుబ‌లి-2  సునామీలో `ఖాన్‌`ల రికార్డులు చెల్లాచెద‌రు

బాలీవుడ్ `ఖాన్‌`ల రికార్డులు సునామీలో కొట్టుకుపోయాయి. ప్రపంచం నివ్వెర పోయేలా.. అంద‌రూ అవాక్క‌య్యేలా.. ఒక తెలుగు సినిమా క‌లెక్ష‌న్ల దండయాత్ర చేస్తోంది. ఒక్క బాలీవుడ్ హీరోలు, ద‌ర్శ‌కుల‌కే సాధ్య‌మ‌నుకున్న 1000కోట్ల మార్కును అందుకునేందుకు తెలుగు సినిమా ఒకే అడుగు దూరంలో నిలిచింది. `ఇది తెలుగొడి స‌త్తా` అని చాటుతోంది బాహుబ‌లి-2. తెలుగువాళ్లంతా స‌గ‌ర్వంగా ఇది మా సినిమా అనుకునేలా భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అద్భుత చిత్రంగా నిలిచింది. దర్శక ధీరుడు రాజ‌మౌళి అద్భుత సృష్టికి ప్రేక్ష‌కులు స‌లామ్ కొడుతున్నారు.

జ‌క్క‌న్న‌ రాజమౌళి చెక్కిన బాహుబలి2.. భారత సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప చిత్రంగా అవతరించింది. ఇప్పటి వరకూ ఏ భారతీయ సినిమాకూ సాధ్యంకానన్ని వసూళ్లు సాధించి.. ఇప్పుడు రూ.1000కోట్ల కలెక్షన్‌ వైపు దూసుకెళ్తోంది. ఈ లక్ష్యం కూడా నేడో.. రేపో పూర్తవుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తొలి తొమ్మిది రోజుల్లో రూ.925 కోట్లు సాధించిన ఈ సినీ ఖండానికి మరో రూ.75 కోట్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నారు. ఈ వీకెండ్‌లోనే 1000 కోట్ల కలెక్షన్‌ కూడా పూర్తవుతుందని అంచనా.

బాహుబలి2 వెయ్యికోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించనుంది. ఏప్రిల్‌ 27న ప్రపంచ వ్యాప్తగా 8000 స్ర్కీన్లపై ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా వసూళ్లపై దక్షిణ భారత సినీ ట్రేడ్‌ విశ్లేషకుడు రమేశ్‌ బాలా ట్విటర్లో స్పందిస్తూ.. ఇప్పటి వరకూ ఈ సినిమా 925 కోట్లు వసూలు చేసిందని తెలిపాడు. తనకు తెలిసి.. భారత సినీ చరిత్రలో ఇప్పటి వరకూ ఏ సినిమా ఇలాంటి బిజినెస్‌ చేయలేదని వ్యాఖ్యానించాడు. బాహుబలి2 ఇప్పటి వరకు భారత్‌లో 745 కోట్లు (గ్రాస్‌).. విదేశాల్లో 180 కోట్లు వసూలు చేసింది.

ఇంతకు ముందు అత్యధిక వసూళ్లు సాధించిన భారత చిత్రం రికార్డు అమీర్‌ఖాన్‌ నటించిన పీకే చిత్రంపేరిట ఉంది. ఇది మొత్తం రూ.792 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఈ రికార్డును బాహుబలి2 తొలివారంలోనే చెరిపేసింది. బాలీవుడ్‌కు స‌రికొత్త స‌వాల్ విసిరిన‌ట్టేన‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా!! మ‌రి ఇలానే కొన‌సాగితే ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచిచూడాల్సిందే!!