చిరు చెయ్యేసినా….ఇంకా కష్టాల్లోనే తేజు

June 12, 2018 at 3:31 pm

ఆ హీరోకి హిట్ వ‌చ్చి రెండేళ్లు దాటిపోయింది. సినిమాలు వ‌చ్చాయి బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టి వెళ్లిపోయాయి. హీరో అన్నాక హిట్లు ప్లాపులు స‌హ‌జ‌మే అనుకున్నాడు ఆ డైరెక్ట‌ర్‌! ఆ ఫెయిల్యూర్ హీరోతో సినిమా ప్రారంభించాడు. డైరెక్ట‌ర్ కి కూడా హిట్ వ‌చ్చి చాలా ఏళ్లే దాటిపోయింది. ఫీల్ గుడ్ మూవీలు తీస్తాడని పేరున్నా.. ఈ మ‌ధ్య తీసిన సినిమాల‌న్నీ ఆశించిన విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయాయి. డైరెక్ట‌ర్‌కు ఉన్న పేరు, హీరో బ్యాగ్రౌండ్ బ‌ట్టి.. వీళ్ల‌తో సినిమా తీసేందుకు నిర్మాత ముందుకొచ్చారు. హీరో మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకోలేదు. డైరెక్ట‌ర్ ఇమేజ్‌ను కూడా ప‌ట్టించుకోలేదు. సినిమా క్వాలిటీ విష‌యంలో అస్స‌లు రాజీ ప‌డ‌లేదు. సినిమా పూర్త‌యింది. కానీ దీనిని కొనేందుకు మాత్రం బ‌య్య‌ర్లు ముందుకు రావ‌ట్లేదు. ఓవర్సీస్‌లో సినిమాను మంచి రేట్లకు అమ్ముకున్నా తెలుగులో బయ్యర్ల దగ్గర పెద్ద చిక్కొచ్చింది. ఈ సినిమాకి అంత బ‌జ్ లేకపోవ‌డంతో సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌.

పాపం.. సాయిధ‌ర‌మ్ తేజ్‌!! యాక్టింగ్‌లో ఈజ్ ఉంది. డ్యాన్స్ అద‌ర‌గొడ‌తాడు! కామెడీలోనూ మంచి టైమింగ్ ఉంది. కానీ సినిమా ఎంపిక‌ల్లో మాత్రం స‌రైన డెసిష‌న్ తీసుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. ప్ర‌స్తుతం ఫెయిల్యూర్ ఎఫెక్ట్‌.. తేజ్ ఐల‌వ్‌యూ సినిమాపై ప‌డిండ‌ట‌. జ‌యాపజయాలు సినిమా పరిశ్రమలో ఎంతగా ప్రభావితం చేస్తాయో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కి ప్రత్యక్షంగా తెలిసి వస్తోంది. తన కొత్త సినిమా తేజ్ ఐ లవ్ యు కి ఆశించనంత బజ్ లేకపోవడంతో..ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి మెగాస్టార్ చిరంజీవిని అతిథిగా తీసుకొచ్చారు. అయినా దీని ప్ర‌భావం మాత్రం బిజినెస్ మీద ప‌డ‌లేద‌ట‌. కారణం తేజ్‌కి రెండేళ్లలో వచ్చిన డిజాస్టర్లే. మెగా హీరోని న‌మ్మి.. సినిమా కొనేందుకు మాత్రం డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా లేరట‌. అందుకే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంకా వ్యాపార లావాదేవీలు పూర్తి కాలేదని తెలుస్తోంది. అందుకే ముందు ప్రకటించిన జూన్ 29 విడుదలకు కట్టుబడటం అంత ఈజీగా కనిపించడం లేదు.

హీరో ఇమేజ్ తో పాటు దర్శకుడి ట్రాక్ రికార్డు కూడా సినిమా బిజినెస్ డ‌ల్ అవ్వ‌డానికి కార‌ణ‌మ‌ట‌. ద‌ర్శ‌కుడు కరుణాకరన్.. అప్పుడెప్పుడో ప్రభాస్ తో హిట్టు కొట్టిన డార్లింగ్ సినిమా త‌ప్ప రీసెంట్‌గా హిట్ లేదు. సినిమాకు ఏ మాత్రం డివైడ్ టాక్ వచ్చినా రెండో రోజే సినిమాను నిలబెట్టలేనంత వీక్ పొజిషన్ లో తేజు ఉన్నాడన్నది నిజం. ఇలాంటి అడ్డంకులు ఇన్ని పెట్టుకుని తేజ్ ఐ లవ్ యు చెప్పిన టైంకి రావడం గురించి పలు అనుమానాలు ఉన్నాయి. పైగా టైటిల్ మరీ సాఫ్ట్ గా ఉండటం ఒక ఎత్తైతే మెగా హీరోలకు బలమైన మాస్ ని టార్గెట్ చేసిన అంశాలు లేనట్టుగా ఇంప్రెషన్ క్రియేట్ చేయటం ఇవన్నీ నెగటివ్ గా పని చేస్తున్నాయ‌ట‌.

దీనికి తోడు సీనియర్ నిర్మాతే అయినప్పటికీ సబ్జెక్టు డిమాండ్ చేయటంతో ముందు అనుకున్న దాని కన్నా కెఎస్ రామారావు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చిందట. ప్ర‌స్తుతం బయ్యర్ల నుంచి వస్తున్న స్పందన వల్ల ఆయ‌న‌ ఆలోచనలో పడినట్టు తెలిసింది. సాఫ్ట్ లవ్ స్టోరీ కాబట్టి తొలిప్రేమ తరహాలో వర్క్ అవుట్ అవుతుంది అనే నమ్మకంతో ఓవర్సీస్ వరకు మంచి రేట్లకు అమ్ముకున్నారు కానీ చిక్కంతా తెలుగు బయ్యర్ల దగ్గర వచ్చింది. జవాన్-ఇంటెలిజెంట్ లాంటి సినిమాలు మంచి హైప్ తో వచ్చినప్పుడే నష్టాలు తప్పలేదు అలాంటిది బజ్ తక్కువగా ఉన్న తేజ్ ఐ లవ్ మీద రిస్క్ చేయలేమని తేల్చి చెప్పినట్టు వినికిడి. ఇప్పటికైతే జూన్ 29 మంచి డేట్. పోటీ కూడా లేదు. వాయిదా పడిందా జులైలో మాంచి రసవత్తరమైన పోటీ ఉంది. అప్పుడు నెగ్గడం అంత సులభంగా ఉండదు. మ‌రి ఏమవుతుందో!

చిరు చెయ్యేసినా….ఇంకా కష్టాల్లోనే తేజు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share