క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ “రాక్ష‌సుడు” రివ్యూ

August 2, 2019 at 10:37 am

న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌
మ్యూజిక్‌: జిబ్రాన్‌
నిర్మాత‌: స‌త్య‌నారాయ‌ణ కోనేరు
ద‌ర్శ‌క‌త్వం: ర‌మేష్‌వ‌ర్మ పెన్మెత్స‌
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 149 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 2 ఆగ‌స్టు, 2019

భారీ విజ‌యాన్ని అందుకున్న సినిమాను రిమేక్ చేయడం సాహ‌సంతో కూడుకున్న‌ప‌నే. ఏం కొంచెం తేడా వ‌చ్చినా.. కెరీర్‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. ద‌ర్శ‌కుడి నుంచి హీరోహీరోయిన్ల వ‌ర‌కూ దాని ప్ర‌భావం చూపుతోంది. త‌మిళ్‌లో మంచి విజ‌యాన్ని అందుకున్న క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ రాట్సాస‌న్‌ను తెలుగులో రాక్ష‌సుడుగా తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ర‌మేశ్ వ‌ర్మ‌. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా.. నిత్యం ఏదో ఒక కొత్త‌ద‌నం క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఇందులో హీరోగా న‌టించారు. ఆయ‌న‌కు జంట‌గా అనుప‌మ‌ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించారు. అయితే.. మేర‌కు ఈ సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకుందో తెలుస‌కునే ప్ర‌య‌త్నం చేద్దాం..

క‌థేమిటంటే..
ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌(అర్జున్ కుమార్‌) ఓ పోలీస్‌. కుటుంబ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న పోలీస్ జాబ్‌లో చేరుతాడు. ఇక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్‌(కృష్ణవేణి) ఓ పాఠ‌శాల‌లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తూ ఉంటుంది. అయితే.. అనుకోకుండా అమ్మాయిలు అదృశ్యం అవుతుంటారు. ఈ క్ర‌మంలో అనుప‌మ ప‌నిచేస్తున్న పాఠ‌శాల‌కు చెందిన అమ్మాయి కూడా క‌నిపించ‌కుండా పోతుంది. మిస్సింగ్ అయిన అమ్మాయిలంద‌రూ శ‌వాలై క‌నిపిస్తుంటారు. ఈ హ‌త్య‌ల వెనుక ఎవ‌రున్నారు.? ఎందుకు జ‌రుగుతున్నాయి..? ఈ కేసుల‌ను సాయి శ్రీ‌నివాస్ ఎలా ఛేదించాడు. అందులో అనుప‌మ పాత్ర‌మేమిటి..?, వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఎలా ఉన్న‌య‌న్న‌ది మాత్రం తెర‌పైనే చూడాలి మ‌రి.

ఎలా ఉందంటే…
త‌మిళ‌లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌ల అయి ఊహ‌కంద‌ని విజ‌యాన్ని అందుకున్న రాట్సాస‌న్ సినిమాకు రిమేక్‌గా తెలుగులో రాక్ష‌సుడు వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు ర‌మేశ్ వ‌ర్మ‌.. ఎక్క‌డ కూడా త‌డ‌బాటు లేకుండా.. తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్టు తెర‌పై చూపించి, ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేశాడ‌ని చెప్పొచ్చు. క‌థ‌ను న‌డిపించిన తీరు అద్భుతంగా ఉంది. ఊహించ‌ని ట్విస్ట్‌ల‌తో ప్రేక్ష‌కుడిని కుర్చీలో క‌ద‌ల‌నివ్వ‌లేదు.

సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వ‌ర‌కు సాగ‌దీత‌కు అవ‌కాశం లేకుండా న‌డిపించాడు. అనేక ట్విస్ట్‌లు, భావోద్వేగాలు క‌ల‌బోత‌గా సినిమా ముందుకు సాగుతుంది. సినిమాలో ర‌మేష్‌వ‌ర్మ టేకింగ్ హైలెట్‌. ఇక ఇందులో విల‌న్ పాత్ర‌కు త‌మిళ్‌లో చేసిన న‌టుడిని తీసుకోవ‌డంలోనే ద‌ర్శ‌కుడు ర‌మేశ్‌వ‌ర్మ స‌క్సెస్ దాగి ఉంది. అయితే.. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. త‌మిళ్‌లో ఈ సినిమా చూసిన వారికి రాక్ష‌సుడులో పెద్ద‌గా కొత్త‌ద‌నం ఏమీ క‌నిపించ‌క‌పోవ‌చ్చు. ఆ ఒక్క మైన‌స్ ప‌క్క‌న పెట్టేస్తే రాక్ష‌సుడు బెల్లంకొండ కెరీర్‌లోనే క‌థాప‌రంగాను, క‌మ‌ర్షియ‌ల్ ప‌రంగాను మంచి హిట్ సినియాగా మిగిలే ఛాన్స్ ఉంది.

ఎవ‌రెలా చేశారంటే…
పోలీస్ పాత్ర‌లో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ సూప‌ర్బ్ అనిపించాడు. ప్ర‌తీ సినిమాకు న‌ట‌నా ప‌రిణ‌తిని పెంచుకుంటున్నాడు. రాక్ష‌సుడు సినిమాలో సాయి శ్రీ‌నివాస్ న‌ట‌న గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. గ‌త సినిమాల కంటే.. ఈ సినిమాలో ఆయ‌న‌కు మంచి మార్కులు ప‌డుతాయి. ఈ రీమేక్‌తో తెలుగు మంచి విజాయాన్ని అందుకున్నాడ‌నే చెప్పొచ్చు. ఇక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ కూడా త‌న పాత్ర‌కు న్యాయం చేశారు. విలన్ పాత్ర చేసిన శరవణన్ కోసం మాట్లాడి తీరాల్సిందే. ఫేస్ క‌న‌ప‌డ‌కుండా అత‌డు చేసిన క్రూర‌మైన విల‌నిజం పండిచింది.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…
అలాగే.. ఇక్క‌డ మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే.. సంగీత ద‌ర్శ‌కుడు జిబ్రాన్‌. ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచేది ఆయ‌న అందించిన నేప‌థ్య సంగీత‌మే. మొత్తం బ్యాగ్రౌండ్ స్కోర్‌తోనే ప్రేక్ష‌కుడు సినిమాలో లీన‌మైపోతాడు. అంత‌లా మెప్పించాడు. ఇక వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ స్క్రీన్ ప్లే కు తగ్గట్టుగా స‌రిపోయింది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. మొత్తంగా చూసుకున్నట్టయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంచుకున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో తన ఖాతాలో మంచి విజయాన్ని అందుకున్నారని చెప్పాలి.

ఫైన‌ల్‌గా…
రాక్ష‌సుడు బెల్లంకొండ‌కు తొలి క‌మ‌ర్షియల్ హిట్‌

రాక్ష‌సుడు TJ రేటింగ్‌: 3 / 5

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ “రాక్ష‌సుడు” రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share